ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాణులన్నీ నాశమయ్యాయి. ఓడమాత్రం నీటిమీద తేలాడింది. చాలరోజుల తర్వాత వరద తీసిపోయి నీళ్లు ఇంకిపోయాయి. నోవా కుటుంబంతో, ఇతర ప్రాణులతో ఓడనుండి వెలుపలకి వచ్చాడు. కృతజ్ఞతా పూర్వకంగా దేవునికి బలి సమర్పించాడు. దేవుడు మళ్లా జలప్రళయం ద్వారా లోకాన్ని నాశం చేయనని నోవాకు మాట యిచ్చాడు. దానికి గురుతుగా ఆకాశంలో ఇంద్ర ధనుస్సు పెట్టాడు. ఆ మీదట క్రొత్తలోకం ప్రారంభమైంది.

6. బాబెలు గోపురం - ఆది 11,1-9

నోవా తర్వాత వచ్చిన జనం మళ్లా దుష్టులైపోయారు. వాళ్లు బాబెలు నగరంలో జీవిస్తూ అక్కడ పెద్ద గోపురం కట్టడానికి పూనుకొన్నారు. దాని మీదిగా స్వర్గానికి ఎక్కపోయి తమకు పేరు తెచ్చుకోవాలనుకొన్నారు. వారి గర్వం దేవునికి నచ్చలేదు. అతడు వారి భాషను తారుమారు చేశాడు. అందుచే ఆ ప్రజలు ఒకరినొకరు అర్థంజేసికోలేక పోయారు. అంతటితో గోపుర నిర్మాణం ఆగిపోయింది. జనం ఆ నగరం నుండి లోకం నలుమూల లకు చెల్లాచెదరైపోయారు.

7. అబ్రాముకి పిలుపు - ఆది 12, 1-5

కాల్జియా దేశంలోని ఊర్ అనే పట్టణంలో తెరా అనే నరుడు వసిస్తున్నాడు. అబ్రాము, నాహోరు, హారాను అతని కుమారులు. దేవుడు అబ్రాముని తన దాసునిగా ఎన్నుకొన్నాడు. అతనికి నూత్నదేశాన్నీ పెద్ద సంతతినీ దయచేస్తానని మాట యిచ్చాడు. అబ్రాముని ఊర్ నుండి ఆ నూత్న దేశానికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. అతడు దేవునిమాట నమ్మికుటుంబ సమేతంగా బయలు దేరి దారిలో కొన్నాళ్లు మోసపోటామియా దేశంలోని హారానులో వసించాడు. అక్కడి నుండి కదలి భార్యసారయితో చాలరోజులు ప్రయాణంచేసి కనాను దేశంలోని షెకెము చేరుకొన్నాడు. అప్పడు అతనికి 75 ఏండ్లు. ఈ యజ్రామూ అతని సంతతీ భవిష్యత్తులో ఒక రక్షకుడు ఉద్భవిస్తాడని నమ్మారు. అబ్రాము సంతతి నుండే రెండువేల యేండ్ల తర్వాత మెస్సీయా ఉద్భవించాడు.