ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. సంసోను జననం - న్యాయాధి 13

ఫిలిస్టీయులు నలభైయేండ్లపాటు యిస్రాయేలు జనాన్ని రాచిరంపాన బెట్టారు. వారి బారినుండి తన ప్రజలను కాపాడ్డానికి ప్రభువు సంసోనుని ఎన్నుకొన్నాడు. అతని తండ్రి మనోవా, తల్లి గొడ్రాలు. ఒకదినం దేవదూత ఆమెకు దర్శనమిచ్చి నీకొక బిడ్డడు పుడతాడు. ఆ బిడ్డడు ద్రాక్షరసంగాని మద్యంగాని సేవింపగూడదు. వాని తలజట్టు కత్తిరించకూడదు. నాజరేయ వ్రతాన్ని పాటించాలి. దైవసేవలో వుండిపోవాలి అని చెప్పాడు. తర్వాత ఆమెకు మగబిడ్డడు కలగగా అతనికి సంసోను అని పేరుపెట్టారు. అతడు చిన్ననాటినుండి అసాధారణమైన బలం కలవాడు. ఒకసారి సింహం అతని మీదికి దూకగా దాన్ని పట్టుకొని మేకపిల్లను లాగ చీల్చివేశాడు. ఇంకొకసారి గాడిద దౌడ ఎముకతో బాది వేయిమంది ఫిలిస్తీయులను చంపాడు. ఇంకొక సారి శత్రువులు తన్ను త్రాళ్లతో బంధింపగా వాటిని నూలు పోగుల్లాగ తైంచివేశాడు. ఫిలిస్టీయులు అతని బలానికి దడిశారు.

42. డెలీలా మోసం - న్యాయాధి 16, 15-22

సంసోను యిస్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి. వారి శత్రువులు ఫిలిస్టీయులు. అతడు ఫిలిస్టీయ యువతి డెలీలా వలలో చిక్కుకొన్నాడు. సొంత జాతివాళ్లు ఆమెకు లంచం పెట్టి సంసోను విచిత్రబలం దేనిలో వుందో తెలిసికొమ్మన్నారు. అతడు మొదట తన బలరహస్యాన్ని తెలియజేయలేదు. కాని డెలీలా విసిగించడం వల్ల ఆమె పోరు బడలేక నాబలం నా తలజట్టులో వుంది. దాన్ని కత్తిరించివేస్తే నాబలం పోతుంది అని చెప్పాడు. అతడు నాజరేయవ్రతాన్ని చేపట్టాడు. ఆ వ్రతం పాటించేవాళ్లు జుట్టు గొరిగించు కోరు. ఆ వ్రతమే అతనికి గొప్ప బలాన్నిచ్చింది. డెలీలా సంసోనుని నిద్రపుచ్చి అతని జడలు ఏడింటిని గొరిగించింది. దానితో సంసోను బలం నశించింది. ఫిలిస్టీయులు అతన్ని సులువుగా బంధించి కన్నులు పెరికివేశారు. గాసాకు కొనిపోయి అతనిచే గానుగమాను త్రిప్పించారు. మహావీరుడు తన పొరపాటు వల్లనే గానుగను త్రిప్పే పశువుతో సమానమయ్యాడు. గొప్పవారి అగచాట్లు గూడ గొప్పవిగానే వుంటాయి.