ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ప్రసార ప్రముఖులు.

రాబాదు విభాగం అధికారిగా 1971-75 మధ్యకాలంలో పనిచేశారు. 1977 నుండి ఆకాశవాణి వార్తా విభాగంలోను ఆ తర్వాత దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా పనిచేసి 1981లో పదవీ విరమణ చేశారు.

రచయితగా, గ్రంథకర్తగా, గ్రంథ సమీక్షకులుగా ఆంజనేయులు మదరాసులో పేరు తెచ్చుకొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారికి సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రను, కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్రను వ్రాశారు. సోవియట్ యూనియన్, ఐరోపా దేశాల పర్యటన వివరాలతో "Window to the West" అనే గ్రంథం వ్రాశారు. ఆధునిక తెలుగు కవులు దేవులపల్లి, శ్రీశ్రీ కవితల్ని ఆంగ్లంలోకి అనువదించారు. హిందూ పత్రికలో "Between You and me" శీర్షిక ఒక దశాబ్దిపాటు నిర్వహించారు. మూడేళ్ళు మదరాసు ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా వ్యవహరించారు. తెలుగువారు గర్వించదగిన ఆంగ్ల జర్నలిష్టు. దక్షిణభారతంలో పుట్టి ఆంగ్ల రచయితగా ప్రఖ్యాతి తెచ్చుకొన్న కొద్దిమంది రచయితల్లో ఆంజనేయులు ప్రముఖులు. హిందూ పత్రికతో వీరికి సన్నిహిత సంబంధం వుంది. వీరి సమీక్షలు సాహితీ విమర్శకు నికషోపలాలు. ఆంజనేయులు మదరాసు నగరంలో స్థిరపడ్డారు.

గుర్రం జాషువా (1895-1971) :

గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండంలో 1895 సెప్టెంబరు 28న జన్మించారు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తి గడించారు. 1910 నుండి 15వ సం. వరకు టీచరు వృత్తిని చేపట్టి పేరు తెచ్చుకొన్నారు. 1919 నుండి గుంటూరు ట్రైనింగ్ స్కూలులో టీచర్ గా 10 ఏళ్ళు పనిచేశారు. 1929 నుండి ఉభయభాషా ప్రవీణ పండితులుగా జిల్లాబోర్డు పాఠశాలల్లో పనిచేశారు. కవి కోకిల, కవిదిగ్గజ, మదుర శ్రీవాత బిరుదులతో పాటు కనకాభిషేక గజారోహణాలు పొందారు.

ఆకాశవాణి మదరాసు కేంద్రంలో తెలుగు ప్రసంగాల ప్రొడ్యూసర్‌గా 1956లో చేరారు. (1956-59) నాలుగేళ్ళ పాటు విధి నిర్వహణ చేశారు. ఆయన కవితా కంఠం విలక్షణమైంది. తెలుగుజాతి నుడికారం ఆయన కొల్లగొట్టారు. వీరేశలింగం గారిని రాజమహేంద్రవరంలో కలుసుకోగా వారు చిలకమర్తిని పరిచయం చేశారు.