ఈ పుట ఆమోదించబడ్డది

68

ప్రసార ప్రముఖులు.

సుత్తి వీరభద్రరావు :

ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి ధృవతారలయ్యారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. ఆయకు ' సుత్తి ' పదం పేరులో భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించి ఎనలేని కీర్తి సంపాదించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు. 1988 జూన్ 30 న వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు. విజయవాడ కేంద్రంలో ఆయన నాటక విభాగములో చాలాకాలం పనిచేశారు. మంచి నటుడు, ప్రయోక్త.

నాటక రంగాన్ని పరిపుష్టం చేసిన మరికొందరిని స్మరించాలి. వేమవరపు శ్రీధరరావు నటుడుగా ప్రసిద్ధి గడించారు. అలానే కూచిమంచి కుటుంబరావు, వెంపటి రాధాకృష్ణ, సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, నాగరత్నమ్మ, వి.బి. కనకదుర్గ, A.B. ఆనంద్, కమలకుమారి, నాటక విభాగంలో విశేష కృషి చేశారు. విజయవాడ నాటకాలంటే శ్రోతలు అప్పటికీ, యిప్పటికీ చెవులు కోసుకొంటారు. శ్రీ. S. A. పద్మనాభరావు ట్రాన్సిమిషన్ ఎగ్జిక్యూటివ్ గా 1978లో చేరి ప్రజా సంబంధాలు పటిష్టం చేశారు. 1991లో PEX అయ్యారు.

జె. వరలక్ష్మి, జె. శ్యామసుందరి హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో కొద్దికాలం పనిచేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్న V. S. రమాదేవి కొంతకాలం హైదరాబాదు కేంద్ర మహిళా విభాగం వ్యాఖ్యాతగా పనిచేశారు.

మోతీ వేదకుమారి విజయవాడ సంగీత విభాగంలో కొంతకాలం పనిచేసి పదవీ విరమణ చేసి ఏలూరు నియోజకవర్గ కాంగ్రెసు అభ్యర్ధిగా లోక్‌సభ సభ్యురాలుగా 1957లో ఎన్నికయ్యారు. ఇదొక విశేషం. ఇలానే హైదరాబాద్ లో అనౌన్సర్ గా పనిచేసిన సాదత్ అలీ ఖాన్ ప్రధానమంత్రి నెహ్రుకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసి పార్లమెంటు సభ్యులు కావడం విశేషం.