ఈ పుట ఆమోదించబడ్డది

60

ప్రసార ప్రముఖులు.

విజయవాడలో ప్రయాగ గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పని చేశారు. ఎన్నొ జానపద గేయాలను పాడి, పాడించి శ్రోతల మన్ననలందుకొన్నారు. హరికథలు స్వయంగా రచించి గానం చేశారు. త్యాగరాజ చరిత్ర, కన్యాకుమారి, గాంధీజీ, శంకర విజయం హరికథలు ప్రముఖాలు. 1962లో భారత ప్రధాని శ్రీ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథను వినిపించి బంగారు పతకంతో సన్మానించబడ్డారు. వీరి బుర్రకథలు HMV గ్రామఫోను రికార్డులుగా విడుదలైనాయి.

వినోదాల వీరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు. ఆకాశవాణి ప్రయాగకు ఆరోప్రాణం. 1969లో పదవీ విరమణ చేసేంతవరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు వెలువడ్డాయి. 1970 నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీవారి పక్షాన ' బాలాజీ ఆర్ట్ థియేటర్ ' పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. 1980 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళా పీఠంలో యక్షగానాలు, హరికథల అధ్యాపకులుగా పనిచేశారు. హిందు ధర్మ ప్రచార పరిషత్ లో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు. 1983 సెప్టెంబరు 11న పరమపదించారు. మాట, పాట, ఆటలతో శ్రోతల్ని సంబరపెట్టిన ప్రయాగ నిత్యోత్సాహి. ప్రయాగ నరసింహశాస్త్రి కుమార్తె వేదవతి ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు.

జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (1914)

జరుక్ శాస్త్రి గా ప్రసిద్ధులైన వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రి గా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 1968లో పరమపదించారు. వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో అకౌంటెంటు.