ఈ పుట ఆమోదించబడ్డది

50

ప్రసార ప్రముఖులు.

డా. బాలాంత్రపు రజనీకాంతరావు (1920)

జంట కవులైన వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వెంకటరావుగారి కుమారులు. రజనీకాంతారావు. 'రజని ' గా పిలవబడే వీరు 1920 జనవరి 29న జన్మించారు. బాలాంత్రపు నళినీ కాంతారావు వీరి అగ్రజులు. రజని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుండి 1940లో ఎం.ఏ. తెలుగులో చేరారు. పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు.

రజని శతపత్ర సుందరి గీత సంపుటి. రెండు వందలపైగా గీతాలున్నాయి. ఈ గ్రంథానికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది. విశ్వవీణ రేడియో నాటకాల సంకలనం. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. 1958లో తెలుగు భాషా సమితి పోటీలలో ఈ గ్రంథం బహుమతి పొందింది. 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వీరికి లభించింది.

ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రసమధురంగా రచించారు. చండీదాసు, మేఘసందేశం, మధురానగరిగాథ, సుభద్రార్జునీయం వీరి సంగీత రూపకాలలో ప్రసిద్ధాలు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించారు. స్వరకర్తగా ఆయన ప్రసిద్ధులు. క్షీరసాగర మధనం, విప్రనారాయణ రూపకాలకు గీతాలు సంగీతం సమకూర్చారు. కొండ నుండి కడలి దాకా రూపకం సమర్పించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. జపాన్ దేశానికి చెందిన టోక్యో బహుమతి ఈ రూపకానికి 1972లో లభించింది. గేయకవిగా, సినీ గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. 1977లో మేఘసందేశ రూపకానికి బెంగుళురులొ ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది.

భానుమతి, రజని కలిసి పాడిన పాటలు చిత్రసీమలొ గణన కెక్కాయి. ప్రోగ్రాం అసిస్టెంట్ గా మదరాసులో 1944లో చేరి బెంగుళురు కేంద్రంలో 1978 జనవరిలో స్టేషన్ డైరక్టరుగా పదవీ విరమణ చేశారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వ విద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు. ఏది చేసినా రజని ముద్ర ప్రత్యేకం. స్వర్గసిమ, గృహప్రవేశం ఇత్యాదిచిత్రాలకు పాడారు.