పుట:Prasarapramukulu022372mbp.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ప్రసార ప్రముఖులు.

స్వర సుధాకరులు

సినిమారంగంలో తెరమీద కనిపించే నటులకున్న ప్రాధాన్యం తెరవెనుక వున్న కళాకారులకు ప్రేక్షకుల్లో వుండదు. ఆకాశవాణిలో కూడా నిత్యం తమ కంఠస్వరాన్ని వినిపించే అనౌన్సర్లకున్న ప్రాముఖ్యం శ్రోతలలో మిగతా కార్యక్రమ నిర్వాహకులకుండదు. ఒక్కొక్కసారి కొందరు అడుగుతుంటారు. ' స్టేషన్ డైరెక్టర్‌కు అనౌన్సరు ప్రమోషన్ రావాలంటే ఎన్నేళ్లు పడుతుందని? ' వాళ్ళ దృష్టిలో అనౌన్సరు చాలా ప్రధాన వ్యక్తి.

నిజానికి ప్రసార సమయంలో అనౌన్సరు అష్టావధానిలా ప్రవర్తించాలి. సమయస్ఫూర్తి మరీ అవసరం. పొరబాట్లను కప్పిపుచ్చగలడు, సృష్టించగలడు. కుంభవృష్టి కురుస్తున్నా, తుఫాను బీభత్సం సంభవించినా రాత్రింబవళ్ళు డ్యూటీలు చేసే ప్రధాన పాత్రధారి అనౌన్సరు. శ్రోతలు కోరిన పాటలు మొదలు అనేక కార్యక్రమాల ద్వారా శ్రోతలకు చిరపరిచితుడు.

మదరాసు కేంద్రంలో తొట్ట తొలి తెలుగు అనౌన్సరు మల్లంపల్లి ఉమామహేశ్వరరావు. 'ఉమ' పేరుతో కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయన ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి సోదరులు. మదరాసు కేంద్ర అనౌన్సర్లలో భానుమతి (సినీ భానుమతికాదు) ప్రసిద్ధులు. ప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్‌గారు కూడా మదరాసు కేంద్రంతో అనుబంధం ఉన్నవారే. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం మహిళా విభాగంలో కార్యక్రమ రూపకల్పనలో పాల్గొన్న యువతీమణులలో శ్రీమతి V. S. రమాదేవి పేర్కొనదగినవారు. వీరు 1964లో కేంద్ర న్యాయ సర్వీసులో చేరి 1985-92 మధ్య కాలంలో కేంద్ర లా సెక్రటరీగా వ్యవహరించారు. కొంతకాలం ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసి 1993 జులై నుండి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్నారు. రేడియోతో తమ అనుబంధాల్ని గొప్పగా చెప్పుకొనే వ్యక్తులలో వీరొకరు. వీరు అనేక గ్రంథాలు వ్రాశారు. పంకజం, దారితప్పిన మానవుడు, అందరూ మనుసులే వీరు వ్రాసిన నవలలు. నా కరిగిపోయే కలలు వీరి మ్యూజింగ్స్ రచన

హైదరాబాదు కేంద్రం 1950 లో డెక్కన్ రేడియోతో విలీనమైంది. తెలుగు కార్యక్రమాల ప్రకటనకు అనౌన్సర్లు రిక్రూట్ అయ్యారు. రతన్‌ప్రసాద్, వట్టం సత్యనారాయణ మూడు దశాబ్దాలపాటు అనౌన్సర్లుగా పనిచేసి తమ ముద్ర వేశారు.