ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణు, రుద్ర గ్రంథులను భేదించును. బ్రహ్మనాడి (సుషుమ్న) ముఖద్వారమునకు బిరడావలె అడ్డముగా నున్న శ్లేష్మమును లేకుండ చేయును. కుండలినీ శక్తిని గురించి తెలసి కొనునటులచేయును. వాత పిత్త శ్లేష్మాథిక్యములచే కలుగు వ్యాధులను పారద్రోలును. శరీరమునకు ఉష్ణమును కలిగించును. చలిప్రదేశములో చలినుండి కాపాడుకొనుటకు కావలసినంత ఉష్ణమును సంపాదించు కొనుటకు కావలసిన బట్టలు లేనప్పుడు ఈ ప్రాణాయామమును చేయుము; సరిపోను వేడి వచ్చును. నాడులను శుభ్రపరచును. అన్ని విధములగు కుంభకములలోను, యిది శ్రేష్ఠమైనది. సుషుమ్నా మార్గములో గల మూడు గ్రంధులను భేధించు శక్తి గలది. గాన, దీనిని ప్రతివాడు తప్పక అభ్యసించవలెను. ఇది కుండలినీ శక్తిని త్వరగా మేల్కొలుపును. ఈసాధకుని ఏ వ్యాధియు బాధించదు. ఎల్లప్పుడు ఆరోగ్యమను మహాభాగ్యమును అనుభవించు చుండును.

నీవు ప్రతి ప్రాణాయామముకు చేయు (తొందరగా) శ్వాసోచ్ఛ్వాసల పరిమితి, నీ బలముపై ఆధారపడి యుండును. ఆరుగాని, పది లేక పండ్రెండు వరకుగాని సులభముగ చేయ వచ్చును.అతిగా పోయి అపాయమును పొందకుము.

భస్త్రికను కొలది మార్పులతో యీ దిగువ రీతినికూడ చేయవచ్చును. త్వరత్వరగా పూరక రేచకములు రెండింటిని కలపి యిర్వైమారులు చేసిన పిమ్మట, కుడి ముక్కుతో గాలిని పీల్చి, ఆపుచేయ గలిగినంతసేపు లోపల కుంభించి, ఆపిదప ఎడమముక్కుగుండా నెమ్మదిగా గాలిని విడువుము.