ఈ పుట ఆమోదించబడ్డది

వారు మిక్కుటముగ దుష్ట గ్రంధి వ్యాధిచే పీడింప బడుదురు. శాకాహారులు వార్ధక్యము వరకు ఆరోగ్యవంతులై వుందురు. పాశ్చాత్యదేశములందలి వైద్యశాలలలో (యీనాడు) రోగులకు శాకాహారము నిచ్చు చున్నారు. ఇందువలన వారు త్వరలో ఆరోగ్యమును పొందుచున్నారు.

పై ధాగరన్ అను గ్రీసు తత్త్వవేత్త మాంసాహారము పాపమని చెప్పెను. అతడు, "ఓ మర్త్యులారా! మీ శరీరములను పాప కరమగు ఆహారముతో పెంచుటలో జాగరూకులై యుండుడు. అనేకములగు ఫలములు, ద్రాక్ష, కూరలు, దుంపలు, నీకు బలమునిచ్చి, జఠరాగ్నిని తీర్చుటకు గలవు. అట్లుగాక, పాలు, తైమా పుష్పముయొక్క సువాసనకూడ నీకు యిష్టము కానిచో, ఏవిధమగు రక్తపాతము లేకుండ, పవిత్రమైన ఆహారమును నీకీ భూమాత యివ్వగలదు."

నీవు మాంసాహారమును మానగోరుచో , జంతువధ జరుగు నప్పుడు ఆ జీవులు పడుచుండు బాధను కనులార చూడుము. వెంటనే నీకు జాలికలుగును. మాంసాహారమును మానుటకు నిశ్చయించెదవు. ఇటుల చేయుటకు వీలు కాకపోయినచో, పరిసరములను మార్చి, మాంస మనునది లభించని హోటలులో వుండుము. శాకాహారము వల్ల వచ్చు లాభము మాంసాహారము వల్ల వచ్చు చెడుగులను గురించి ఎల్లప్పుడు తలపోయు చుండుము. శాకాహారులగు వారితోనే కలసి మెలసి వుండుము. ఇందువల్ల నీకు ఫలితము కనిపించనిచో, మాంస విక్రేత యింటికేగి క్రుళ్ళుకంపు కొట్టు చుండు జంతువుల ప్రేవులు మొదలగు వానిని స్వయముగా చూడుము. ఇటుల చేయుటచే మాంసాహారముపై ఏవగింపు కలిగి, వైరాగ్యోదయము కలుగును.