ఈ పుట ఆమోదించబడ్డది

29. మిక్కిలి అలసట చెందిపోవునంతవరకు ప్రాణాయామము చేయకుము. మితిమీరిన నియమములకు కట్టుబడి వుండకుము.

30. ప్రాణాయామము చేసిన వెంటనే స్నానము చేయకుము. ప్రాణాయామానంతరము అరగంటసేపు విశ్రాంతి తీసికొనుము. సాధనాసమయమున చెమటపోసినచో, తువ్వాలతో తుడవవద్దు. చేతితో ఆరిపోవునంతవరకు రుద్దుము. అంతేగాని గాలికి ఆరిపోవులాగున వదలకుము.

31. రేచక పూరకములలో ఏమాత్రము శబ్దమునూ కానివ్వరాదు. భస్త్రిక, కపాలభాతి, శీతలి, సీత్కారి ప్రాణాయామములలో మాత్రము, కొద్ది శబ్దము కావచ్చును.

32. రోజుకు రెండు మూడు నిమిషముల చొప్పున ఒకటి రెండు రోజులు చేసినంతటిలోనే ఏ ఫలితములును కనిపించవు. రోజుకు 15 ని. లకు తక్కువ కాకుండ కొన్నాళ్ళవరకు చేయవలెను. రోజు కొకరకపు సాధనను చేయరాదు. ప్రతి రోజూ చేయుటకు కొన్ని సాధనలను నిర్ణ యించుకొని, వాటి యందే అభివృద్ధిలోనికి వచ్చుటకు ప్రయత్నించవలెను. తదితర సాధనలను ఏకొద్దిగానో ప్రతిరోజుగాని, అప్పుడప్పుడుగాని చేయుచుండవలెను. భస్త్రిక, కపాలభాతి, సుఖపూర్వక ప్రాణాయామములను నిత్యమూ చేయుచుంటివనుకొనుము. శీతలి, సీత్కారి ప్రాణాయామాదులను అప్పుడప్పుడు చేయవచ్చును.

33. పూరకమును 'నిశ్వాస'మనియు, రేచకమును 'ఉచ్చ్వాస' మనియు, కేవల కుంభకమును 'శూన్యక' మనియు, సరియగు కుంభకమును అభ్యసించుటను, 'అభ్యాసయోగ' మనియు, గాలిని త్రాగి జీవించుటను 'వాయుభక్షణ' అనియు అందురు.