ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణాయామము, జపము ధ్యానములను చేయునప్పుడు శరీరము రాతివలె నిశ్చలముగ వుండవలెను.

26. నీ శరీర తత్వమునకు సరిపడు ఆహార నియమములను ఏర్పరచు కొనుము. నీకు సులభముగా అభ్యసించుటకు అనువైన సాధననే మొదట ప్రారంభించుము. దానికి సంబంధించిన వివరముల నన్నిటిని జాగ్రత్తగా చదివి, అర్ధము చేసికొని, ఆ పిమ్మట సాధన మొదలుపెట్టుము. ఇంకను సందేహము లున్నచో, ఎవరైన సాధనచేయుచున్న విద్యార్థి నడిగి సంశయమును నివారించుకొనుము. ఇది సుఖమైన పద్ధతి. నీశక్తికి మించిన సాధనను అత్యాశతో ప్రథమములోనే ప్రారంభించి అపాయములను పొందవద్దు.

27. మొదటిలో రేచక, పూరక కుంభకముల పరిమాణమును లెక్కించుటకు 'ఓం' ను నిర్ణయించి చెప్పితిమి. ఈ మంత్రమునే వుపయోగించవలెనను నియమ మేదియూ లేదు. రామ, శివ, లేక నీ గురువుచెప్పిన మరే మంత్రమునైనగాని, లేక ఒకటి, రెండు, మూడు అని సంఖ్యలను లెక్కించిగాని చేయవచ్చును. కాని 'ఓం' లేక గాయత్రి, ప్రాణాయామమునకు సులభమైనట్టిన్నీ, అనుకూలముగావుండునట్టివిన్ని అయివున్నవి. వీటిని యిదివరలోచెప్పిన, నిష్పత్తి ననుసరించి లెక్కించవలెను. ఉచ్చస్థితికి వచ్చినపిమ్మట ఈ లెక్క లేకుండగనే లెక్కప్రకారము చేయగలుగుట అలవడును.

28. ప్రారంభస్థితిలో నీయందలి అభివృద్ధిని తెలసికొనుటకై లెక్కించవలెను. ఆ తరువాత ఉచ్చస్థితికి వచ్చిన పిమ్మట ఊపిరితిత్తులే నీకు లెక్క చెప్పగలవు.