ఈ పుట ఆమోదించబడ్డది

ముసలి వాడవైన పిదప చేయవచ్చు నని తలచుట భ్రమ. మొక్కగా వున్నప్పుడు వంగనిది, మ్రానై నప్పుడు వంగునా? అను సామెతను జ్ఞాప్తికి తెచ్చుకొని, సాధనచేసి పూర్ణమగు ఫలితములను సంపాదించుము.

23. ఆధ్యాత్మిక సాధనలో ఉచ్చస్థితికి వచ్చిన పిమ్మట పూర్తిగా 24 గంటలు మౌనధారివై యుండవలెను. నీకు అనుకూలముగా నుండునట్టి ఆసన, ప్రాణాయామాదులను ఎంచుకొనుము.

24. ప్రపంచములో అనేక రకములగు వ్యామోహములు వున్నప్పటికీ బ్రహ్మచర్య పాలనము *[1] చేయవచ్చును. చక్కని కట్టుబాటుగల జీవితము, సద్గ్రంధ పఠన, సత్సంగము, జపము, ధ్యానము, ప్రాణాయామము, సాత్విక మైన మితాహారము, ఆత్మ చింతన, ఆత్మ వివేచన, ఆత్మపరీక్ష, సదాచారము, యమ నియమాభ్యాసము, శారీరక వాచిక తపస్సులు, ఇవన్నియు ముక్తిమార్గమునకు గొంపోవును. ఏనుగు తన నెత్తిపై తానే దుమ్ము పోసికొనునటుల తమ దుష్ప్రవర్తనాదులచే తమ జీవితమును తామే కంటక మయముగా చేసికొని, యితరులను నిందించెదరు. ఇంతకు మించిన మూర్ఖత్వము మరొకటి లేదు.

25. శరీరమును గాని, శరీర భాగములను గాని అనవసరముగా ఊపులాటగాని, కదల్చుటగాని చేయకుము. ఇందువల్ల మనస్సు చెదరి పోవును. శరీరమును అదేపనిగ గోకుట తప్పు.

  1. * విపులముగా తెలసికొన గోరుచో నాచే రచింపబడిన "బ్రహ్మ చర్యము" చూడుడు.