పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రము - అనుభూతి

శ్రీసోమనాధశాస్త్రులుగారి తపస్వితపై నాకు మహాభక్తి! కాని వారి ననువర్తింప వలెనని కాని, అనువర్తించినచోఁ గడ తేరఁ గల్గుదు నని కాని నాకు తోఁచ లేదు. యోగ సూత్రములను బాఠము చెప్పునపుడువారు తాము యోగ చెడిన దనియు, ఆపద్ధతుల ననుభూతికిఁ దెచ్చుకొనఁ జాల మయితి మనియుఁ జెప్పిరి. వారి కే సాధ్యము కాని చో మమ్ముదీనిఁ జదివించు టేల యని నాకుఁ దోచెను. కాని కోపింతు రని వారి నడుగ నయితిని. మఱొక నాఁడు నా ప్రశ్నమును వారే వేసికొని " మిలో నెవరయిన వీనిని సాధింపఁ గల రేమో యత్నించి చూడండి. సరియయినగురువు దొరకు నేమో చూడండి. నా కనుభూతి కలుగనంత మాత్రాన శాస్త్ర మప్రమాణ మనుకోకండి. మీరుగా సాహిసించకండి" అనిరి. ఆ మాట నాలోఁ జొచ్చుకొని పోయినది. వారు మంత్రయోగమయులు. అనుష్టానమున గాఢతత్పరతయే కాని వారికి దాని ఫలిత మేమి అన్న యోచనమే యుండెడిది కాదు. చేయవలసినది గనుక చేయుచుండుటయే. ఇటీవల వారి తపఃప్రయత్నమును గూర్చి యోచించుటలో నేతదర్దక మగునుపనిషద్వాక్యము సమాధాయకముగాఁ దోఁ చినది.