పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

అనుభూతి - తద్వికాసము


ఏదో సందర్భములో నా పసి (అయిదు ఎనిమిది సంవత్సరముల నడిమి) వయస్సుననే ఆంజనేయుని దేవళమున బ్రాహ్మణ సంతర్పణము జరుగుచున్నది. నేను నున్నాను. బీటలు వాసి శిధిలముగా నున్న గుడి తలుపుసందున నుండి యెవరో తొంగిచూచిరి. ఆరగించుచున్న లోనివా రది గుర్తించి గద్దించిరి. బైటి మనిషి వైదొలగెను.మె మందఱము భుజించి వెలికి వచ్చితిమి. సాధు వొకఁ డాకొని యక్కడుండెను. ' నేవే కదా తొంగిచూచిన' దని భుక్తానులి ప్తులగు మావా రడిగిరి.' అగునండి! లోని సందడి విని గుడి కదా! లోని కళకళ మేమో అని చూచితిని. భుజించుట చూచితిని. మీరు గద్దించితిరి. మి భోజనానంతర మాకొన్న వానికి నా కింత యన్నము పెట్టుదు రేమో అని కూర్చుంటిని' అనెను.' బ్రాహ్మణ సంతర్పణము చెడగొట్టితివిరా దుర్మార్గుఁడా' యని మావారు చెడదిట్టిరి.' అయ్యా! మి రింత యన్నము పెట్టిన నా కడుపు నిండును గాని మి భోజనము చూచినంత మాత్రమున నాకేమి యొలుకు నండీ! లోన భుజింప వలసిన బ్రాహ్మణు లున్నారు. అంతా ముగిసేదాకా నీకు పెట్ట వీలు లేదు. పొ! తొలగిపొ' మ్మని ఒక మొనగాడు బ్రాహ్మణుఁ డుదరము నులుముకొనుచుఁ దిట్టెను. మిట్టమధ్యాహ్నము పన్నెండు గంటల వేళ!