పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

సందర్భమున నాకు మైమఱుపాటేల కలిగెనో అప్పు డెవ్వరికిని నెఱుక కందలేదు. పెక్కేండ్లకుఁ దర్వాత నాకే అది తెలియ వచ్చినది. అర్హ సందర్భమున దాని చెప్పుదును.

పదేండ్లవయసు రాక ముందే యిట్టిది మఱొక సంఘటన! మా యూర కలరా తీవ్రముగా వ్యాపించినది. ఊరిలో నీ దుర్యాధి వ్యాప్తికి చింతించుచు గుమిగూడి సంభాషించు పలువురలో నేఁడుమాటాడిన వారే రేపు దాని వాతఁ బడుట, మరణించుట జరుగసాగెను. గ్రామస్థు లేన్నెన్నో తంటాలుపడిరి. గ్రామ దేవతలకు ఇతర దేవతలకు మ్రొక్కు కొనిరి. వ్యాధి కొన్నాళ్ళుకు తగ్గిపోయినది. తగ్గిన వెంటనే పెద్ద యెత్తున నాయా దేవతలకు జాతరలు సాగించిరి. ఆ దేవతల యాకృతులు, వారిని గూర్చిన పంబ వారికధలు, జంతుబలులు నాకు చాల రోతను భీతిని గోల్పసాగినవి. దేవత లిట్టివారా? ఈ అర్చన లేనిటి? అని నేను పలుక సాగగా చుట్టుప్రక్కల వారు దేవతలు నాపై కోపగింతు రని ఊరికి చెఱువు చేయుదు రని మాటాడకు మని నాపై కోపగింపసాగిరి. ఆ జాతర తుదినాడు కొర్లంక యను పేరి దేవత కొక బండి గట్టి దాని మిఁద గసిగాలలో పందిపిల్లల నైదింటిని గ్రుచ్చి అవి గిజగిజ కొట్టు కొనుచు మరణయాతన మనుభవించు చుండగా నూరేగించి యూరి బయట ఆయా దేవతల కంపకములు చేసిరి.

నాఁటి దుర్దర్శనము నేఁటికి కనుల గట్టినట్లు గాన వచ్చుచున్నది. ఊరివారు జాతర సరిగా సాగె నని సంత సింపసాగిరి. గొప్ప సంక్షోభంముతో నేను దుఃఖింపసాగితిని.