ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పలేదే. అరణ్యమునుండి ఆమెను లంకకు తీసుకువచ్చేటపుడు కూడా సీతను తాకకుండ భూమితో సహా పెకలించుకొని తెచ్చాను. నాలో పరకాంత వ్యామోహముండినా, నేను కామాంధుడనైనా, ఒంటరిగ చిక్కిన అబలను మానభంగము చేసెడివాడిని కదా!.... అట్లు చేయలేదే!... చేతకాకనా! ధర్మము తెలుసును కనుక అలా చేయలేదు. నాభార్య మండోదరిదేవికి కూడ సీతను ఏ ఉద్దేశముతో తెచ్చానో తెలుసు. త్రికాల జ్ఞానినైన నేను నా మరణము శ్రీరాముని చేతిలో లంకలోనే ఉన్నదని, కనుక రాముణ్ణి లంకకు రప్పించుట కొరకు సీతను తెస్తున్నానని, ముందే నాభార్య మండోదరి దేవికి చెప్పాను. జరుగబోవు భవిష్యత్తు తెలిసిన నేను గొప్పవాడినా! ముందు ఏమి జరుగుతుందో తెలియక, బంగారుజింక ఉంటుందా అని యోచించక, అడవిలోనికి పోయిన రాముడు గొప్పవాడా!... ఈ విషయములోనైన రామునికి ఒకతల తెలివి, రావణునికి పదితలల తెలివి కలదని ఇప్పుడైన ఒప్పుకోక తప్పదు.


సీతను నేను బిడ్డవలె ఆదరిస్తే, ఆ విషయమునే సీతాదేవి రావణ బ్రహ్మ నన్ను కూతురులాగ చూచుకొన్నాడని చెప్పినప్పటికి, రాముడు సీతను అనుమానించి అగ్నిపరీక్షకు నిలబెట్టడము స్త్రీజాతిని అవమానపరిచినట్లు కాదా!... ఈ విషయమును చూస్తే స్త్రీలపట్ల అగౌరవముగ ప్రవర్తించినవాడు రాముడా? రావణుడా? ఎవడైన రాముడనియే ముమ్మాటికి చెప్పకతప్పదు.


రాముడు అశ్వమేధయాగము చేసి అశ్వమును వదలినపుడు, రాముడు స్వయాన తమకు తండ్రియని తెలియని లవకుశులు, అశ్వమును బంధించినపుడు, వారిచేతిలో రాముని సైన్యము ఓడిపోయినపుడు, మొదట లక్ష్మణుడు, ఆ తర్వాత రాముడు లవకుశుల వద్దకు పోయినపుడు, లవ కుశులు రామునిలోని లోపములన్ని బయటపెట్టి, దుర్భాషలాడిన విషయము