ఈ పుట ఆమోదించబడ్డది

కుంటున్నాను. ఇటువంటి సిద్ధాంత ధర్మాలు నీకు ప్రబోధ జేసి, నిన్ను జ్ఞానిగ మార్చినందుకు నాకెంతో ఆనందం కల్గుతున్నది. ఆయన పేరేమిటి? ఎక్కడుంటాడో తెల్పితే నేను కూడ ఒకమారు ఆయనను కలుస్తాను.

వేణు :- ఆయన నామధేయం నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఇమిడి ఉంది. ఆయన స్థలం, ఆయన పేరు తరువాత తెలుపగలను.

(అంతలో వేణు మామయ్య కామేశం ప్రవేశించి)

కామేశం :- ప్రవేశిస్తు పాట

ప॥

జీవుడెక్కడున్నాడో జెప్పరా అసలు
దేవుడెక్కడున్నాడో జెప్పరా
జీవుడెవడు? దేవుడెవడు?
వారికన్న పెద్ద ఎవడు?
చాటుమాటలన్ని మాని నీటుగాను జెప్పరా ॥జీవు॥


చ॥ (1)

గడ్డాలను, మీసాలను ఘనముగా పెంచినోడ
కాషాయ బట్టలతో వేషాలు వేసినోడ
మోయనన్ని పూసాలు మెడనిండా వేసినోడ
వీబూధి రేఖలేన్నో ఇంపుగా పూసినోడ ॥జీవు॥


చ॥ (2)

మాయ వదలి పోవునంచు మంత్రాలు జెప్పుతారు
తలకర్మ తీరునంచు తాయెత్తులు గట్టుతారు
ముక్తి గోరి మీచెంతకు భక్తిగాను జేరితేను
బూటకాల ఎన్నొజెప్పి బూడిదిచ్చి పంపుతారు ॥జీవు॥