ఈ పుట ఆమోదించబడ్డది

పూర్ణయ్య :- ఓస్‌ ఇవేనా నీ సందేహాలు, హిరణ్యకశిపుడు తనకు చావు రాకుండ ఘోరమైన అడవిలో, బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరాలు తపమాచరించాడు నాయనా.

వేణు :- హిరణ్యకశిపుడు అడవులలో పదివేల సంవత్సరాలు తప మాచరించి తిరిగి ఇంటికి చేరునప్పటికి, తన కుమరుడైన ప్రహ్లాదుడు ఐదు సంవత్సరముల బాలునిగా ఉన్నట్లు ఆ చరిత్రలో ఉందిగదా! మరి హిరణ్యకశిపుని భార్య ఎప్పుడు గర్భవతియైనట్లు?

పూర్ణయ్య :- తనభర్త తపస్సుకు పోయే ముందు అయివుంటుంది.

వేణు :- తపస్సుకు పోయే ముందు అయివుంటుందా! అలా జరిగివుంటే పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తిరిగివచ్చిన హిరణ్యకశిపుని కుమారునికి ఐదు సంవత్సరములెలా ఉంటాయి? ఐతే ఆయన భార్య లీలావతి వేల సంవత్సరాలు గర్భాన్ని మోసి కుమారున్ని కన్నందంటారా? ఇలా ప్రపంచము లో ఎక్కడైన జరుగుతుందా! ఇది చాలా విడ్డూరంగదా, ఇది నమ్మదగిన విషయమేనా?

పూర్ణయ్య :- (ఆలోచించి) అలా ఎట్లు జరుగుతుంది? వేలసంత్సరాలు స్త్రీ ఎక్కడైనా గర్భం మోస్తుందా, నవమాసాలు మాత్రమే కదా! అలా జరిగుండదు.

వేణు :- అలా జరిగుండకపోతే హిరణ్యకశిపుడు తపస్సుకు పోయిన తర్వాత, ఆయన భార్య గర్భం ధరించి ప్రహ్లాదున్ని ప్రసవించిందంటారా? అలా జరిగివుంటే పతివ్రతా తిలకమైన లీలావతి శీలానికి మాయనిమచ్చ వస్తుంది కదా! దీనికి పరిష్కారం ఎలా చేసి చెప్పుతావో చెప్పు.

పూర్ణయ్య :- (తలగోక్కుంటు ఆలోచనతో అటు, ఇటు తిరిగి) కొట్టేవురా దెబ్బ, ఎంత ఆలోచించినా ఈ పాయింటుకు సమాధానము దొరకలేదు.