ఈ పుట ఆమోదించబడ్డది

రావణ బ్రహ్మ

ఆకాశవాణి :- బ్రహ్మా! రావణబ్రహ్మా!! మూడుకాలములను తెలిసిన త్రికాలజ్ఞానివి, మూడు యోగములను తెలిసిన బ్రహ్మజ్ఞానివి, మూడు ఆత్మల వివరమును తెలిసిన ఆత్మజ్ఞానివయిన ఓ రావణబ్రహ్మ! త్రేతాయుగము నాటి నిన్ను గురించి కలియుగములోని మనుషులు చెడు ఉద్దేశము కలిగియున్నారు. వారి ఉద్దేశములో నీవు రాక్షషుడవట, నీచుడవట, కామాంధుడవట, యజ్ఞములను నాశనము చేయించిన దుర్మార్గుడవట, సీత స్వయంవరమునకు పోయి శివధనస్సును ఎత్తలేక భంగపడినవాడివట, పరకాంత వ్యామోహముచే సీతాదేవిని అపహరించి ప్రాణముమీదికి తెచ్చుకొన్న అజ్ఞానివట. పదితలలు ఉన్నప్పటికి తెలివిలేనివాడివై, ఒక్కతల కల్గిన రాముని చేతిలో చచ్చిన ఛవటవట, స్త్రీలను గౌరవించని వాడివట, దైవభక్తిలేని మూఢునివట, ఈ విధముగా ఎన్నో రకముల నిన్ను దూషించుచున్నారు. నిన్ను చంపిన రాముణ్ణి దేవునివలె తలచి పూజిస్తున్నారు. కలియుగములోని ప్రజలు ఎందుకు ఆ విధముగ నీమీద దురుద్దేశము కల్గియున్నారు. వీటికి సమాధానము నీవే చెప్పాలి!


రావణుడు :- ఆత్మ స్వరూపమై ఎవరికి కనిపించని ఓ దివ్యవాణీ! నీకు నా నమస్కృతులు. స్వయాన నీవే నన్ను త్రికాలజ్ఞానియని, ఆత్మజ్ఞానియని, బ్రహ్మయని సంభోదించినపుడు, కలియుగములో మంచిచెడు విచక్షణా జ్ఞానములేని మానవులు ఏమంటే నాకేమి? భూమిమీద ద్వాదశ గుణములలో చిక్కి, వాటి వివరము తెలియని మానవులు, అజ్ఞానముతప్ప జ్ఞానమేమిటో తెలియని మానవులు, దేవతలు తప్ప దేవుని గురించి రవ్వంత కూడ తెలియని మానవులు, జనన మరణ అంతరార్థము ఏమాత్రము తెలియని మానవులు, భగవంతునికి, దేవునికి తేడా తెలియని మానవులు, శరీరమును నడిపించుశక్తిని గురించి తెలియని మానవులు, చివరకు తనెవరో