ఈ పుట ఆమోదించబడ్డది

పండితులు :- భూమాతాయజ్ఞము చేస్తే పంటలు బాగాపండుతాయని, ప్రజలు సుఖముగా ఉంటారని చేస్తున్నాము.

భూమి :- ఆహా ఇంతటి మోసమా? మీరు పండితులని పిలిపించు కొనుటకు తగినవారేనా? నాపేరు చెప్పి ప్రజలను మోసము చేస్తారా? నాపేరు పెట్టి యజ్ఞము చేస్తే పంటలు బాగాపండుతాయని నేను ఎవరితోనైనా చెప్పానా? నేను ఎవరికీ చెప్పని విషయమును మీరెందుకు చెప్పుచున్నారు? నీకు యజ్ఞము చేయమని నీతో చెప్పానా? నీతో చెప్పానా? చెప్పండి.

పండితులు :- లేదు తల్లీ! మమ్ములను క్షమించు.

భూమి :- ఏమిటి నేను తల్లినా? నాపేరు భూమాతనా? ఏమీ తెలియని ప్రజలు, మీమాటలువిని నన్ను ఆడదానిగా లెక్కించుకోరా? ఎవరు చెప్పారు. నేను స్త్రీనని చెప్పండి.

పండితుడు :- ప్రకృతి స్త్రీ స్వరూపమని భగవద్గీతలో చదివాము.

భూమి :- ప్రకృతి అంటే ఐదు భాగములు తెలుసా! అందులో నేను ఒక్కణ్ణి, నేను ప్రకృతిలో ఒక భాగమైనంత మాత్రమున నన్ను స్త్రీగా లెక్కించు కోవడము పొరపాటు కాదా? నేను ప్రకృతిలో ఒక్కణ్ణి కావున మీరు నన్ను స్త్రీగా పోల్చి చెప్పుకుంటే, అదే పద్ధతి ప్రకారము అగ్నిని అగ్నిమాతా అనాలి కదా? అలా ఎందుకనలేదు. అగ్ని దేవుడని ఎందుకంటున్నారు. గాలిని గాలిమాత అనవచ్చును కదా? గాలి దేవుడనీ, వాయుదేవుడనీ ఎందు కంటున్నారు. గాలికి పుట్టినవాడు ఆంజనేయుడని చెప్పుకొంటున్నారే. అపుడు స్త్రీగా గాలినెందుకు చెప్పలేదు? ప్రకృతిలో భాగములైన అగ్నిని అగ్ని దేవుడనీ, వాయువును వాయుదేవుడనీ పిలిచెడి మీరు, నన్నేమో భూమాత అని అంటున్నారెందుకు?