ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుడు :- చతుర్వేదములు కంఠాపాటముగా చెప్పువాడిని, నిత్యము గాయిత్రీమంత్రమును ఉచ్ఛరించువానిని, ఎన్నో యజ్ఞములు చేసిన వానిని, నన్నే జ్ఞానము లేనివాడిననీ, నీకంటే దిగువవాడిననీ అంటావా?

చండాలుడు :- నీవు నన్ను మాదిగువవాడంటే, అంటరానివాడంటే, నేను నీకు వివరము చెప్పవలసివచ్చినది. వేదములను కంఠాపాటముగా పారాయణము చేయుటగానీ, ఏ మంత్రమునైన జపించుటగానీ, యజ్ఞములు చేయుటగానీ జ్ఞానముకాదని, దానివలన దేవుణ్ణి తెలియలేరని, భగవద్గీతలో భగవంతుడే చెప్పియున్నాడు కదా! భగవంతుడు గీతలో చెప్పిన దాని ప్రకారము నీవు నాకంటే దిగువవానివి కాదా! మాలాంటి జ్ఞానులందరికి నీవు మాదిగువవానివే. భగవద్గీతలో దేవుడు చెప్పిన దానిప్రకారము జ్ఞానము తెలిసి, దాని ప్రకారము ప్రవర్తించు నేనుగానీ, నాలాంటివారుగానీ అందరు ఎగువవారే. మాకంటే విభిన్నముగా యజ్ఞాలు చేసే మీరు, వేదమంత్రాలు వల్లించే మీరు మాదిగువవారే.

బ్రాహ్మణుడు :- ఏమిటీ వైపరీత్యము. నీవు ఎగువవాడివా, నేను దిగువ వాడినా.

చండాలుడు :- అవును ముమ్మాటికి నిజము.

బ్రాహ్మణుడు :- (తలపట్టుకొని) కాదు కాదు నేనే బ్రాహ్మణున్ని, నీవు మాదిగువవానివే.

చండాలుడు :- సరే నీవే బ్రాహ్మణునివి అనుకుంటాము. నేను ఎదురుగా వస్తే నీకేమి అంటుకొన్నది. నాది పంచభూతములచే నిర్మాణమైన శరీరమే నీది అంతే, శరీరములలో ఏ తేడాలేదు, ఏ అంటులేదు. ఇకపోతే లోపలున్న జీవాత్మ నీ శరీరములో ఒకచోట, నా శరీరములో మరొకచోట ఉన్నదా?