ఈ పుట ఆమోదించబడ్డది

చూపును. తనముందు ఉన్నవానిని ఉన్నట్లే చూపునది సాధారణ అద్దము. కానీ అహమనెడి అద్దము సాధారణ అద్దముకాదు, అది ఒక అసాధారణ అద్దము.

742. అహమనెడి అసాధారణ అద్దము తనముందున్న దృశ్యమును చూపదు. తనముందున్న వాని లోపలి దృశ్యమును చూపుతుంది. ఎవడినైన వానిలోపలి భావమును బట్టి ఏవిధముగానైనా చూపగలదు. ఒక మనిషిని రాజుగా గానీ, మంత్రిగా గానీ, మాంత్రికునిగా గానీ, ఆఫీసర్‌గా గానీ, గుమస్తాగా గానీ, వ్యాపారిగా గానీ, బికారిగా గానీ, ధనికునిగా గానీ, రైతుగా గానీ, డ్రైవర్‌గా గానీ, క్లీనర్‌గా గానీ ఎట్లయిన చూపగలదు.

743. ప్రపంచములో బయట ఎక్కడలేని విచిత్ర అద్దము మనలోపల ఉంది. ఎక్స్‌-రేలు మనిషి లోపలి ఎముకలను చూపినట్లు అహం-కారాలు మనిషి లోపలున్న భావాలను వానికే చూపును.

744. లోపలి అద్దము యొక్క పనితనమును చూచినా, వినినా ఎవడైనా "ఆహా" అనక తప్పదు. ఆహా అనిపించుకొన్న అది లోపల ఎట్లుందంటే! ఎవడికైన లేని దీర్గాలు కరిపించి చూపించే తాను మాత్రము తనకున్న దీర్గాలను తీసివేసుకొని నేను కేవలము "అహ" మునే అంటున్నది.

745. శరీరములోపల అహము ముందర వరుసగా చిత్తము, బుద్ధి, జీవుడు ఉండుట వలన బుద్ధి యొక్క యోచనలను, చిత్తము యొక్క నిర్ణయములను కలిపి జీవునిలో చూపుచున్నది. అందువలన జీవుడు నా యోచనా, నా నిర్ణయము అని అంటున్నాడు.