ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబోధ తరంగాలు

1. చెరుకునుండి రసాన్ని ఆస్వాదించి పిప్పిని వదులునట్లు, గ్రంథములోని భావాన్ని గ్రహించి భాషను వదులు వారు పరిశుద్ధ పాఠకులు.

2. నిరంతర ఆత్మచింతనచే నిన్ను నీవు తెలుసుకోవడమే నిజమైన నీ స్వంతపని.

3. జ్ఞాన మార్గమందు ప్రయాణించాలనుకొనే వారికి అజ్ఞానులే కంటక సమానులై అవరోధములు కల్పించుచుందురు.

4. పిచ్చివానికి రత్నమిచ్చినా దానితో వాడు ప్రయోజనము పొందనట్లు మూర్ఖ చిత్తునకు జ్ఞానోపదేశము చేసినా దానితో వాడు ప్రయోజనము పొందడు.

5. ఆహారపదార్థాల వలన శరీరమూ, గుణవిషయాల వలన మనస్సూ జీవించుచుండును.

6. జ్ఞానేంద్రియాలతో కూడి మనస్సు, విషయములను జీవునకు తెల్పును. జీవుడు అజ్ఞానవశమున అహంకారముతో కూడి ఆ విషయ సుఖదుఃఖములను అనుభవించును.

7. అల్ప సుఖాలకాశించి జీవుడు అజ్ఞానముతో అనంత కష్టాలెన్నో ఎదుర్కొంటున్నాడు.

8. బాహ్యనేత్రాలకగుపించే చీకటి భానోదయము వలన అంతరించును. మనోనేత్రాలకగుపించే చీకటి జ్ఞానోదయం వలన అంతరించును.