ఈ పుట ఆమోదించబడ్డది

605. ఇష్టమును ప్రేమ అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రేమ వేరు, ఇష్టమువేరు.

606. కామమును మోహమును రెండింటిని ఒకటే అనుకుంటారు. కానీ కామము వేరు, మోహము వేరు.

607. ఒక దేవున్ని పొగడడము భక్తి, జ్ఞానము అనుకుంటారు. కానీ అది భక్తి కావచ్చును, కానీ జ్ఞానము ఏమాత్రము కాదు.

608. ఏదో ఒక దేవతనుగూర్చిగానీ దేవున్నిగూర్చిగానీ పాడడము కీర్తన అవుతుంది. కీర్తనవేరు, ధ్యానము వేరు.

609. ఒకరిని కీర్తించడము బయటి ప్రజలకు తెలుస్తుంది. ధ్యానించడము లోపలి ఆత్మకు మాత్రమే తెలుస్తుంది.

610. నీచము, ఉన్నతము వానివాని బుద్ధిని బట్టియుండును. పందికి బచ్చలిగుంత ఉన్నతము, అది మనిషికి నీచము.

611. ఒకని బుద్ధికి దైవజ్ఞానము ఉన్నతముగ కనిపిస్తే, ఇంకొకని బుద్ధికి దైవజ్ఞానము నీచముగ, ప్రపంచ జ్ఞానము ఉన్నతముగ తోచును.

612. లోపల బుద్ధి మారినపుడు బయట నీచము ఉచ్ఛముగా మారగలదు. అపుడే మనిషికి అంతవరకు నీచముగ కనిపించిన జ్ఞానము ఉన్నతముగ తోచును.

613. నీవు చెప్పే జ్ఞానము ఇంకొకనికి నీచముగ కనిపిస్తుందంటే, అది వాని బుద్ధిలోపమే అని గ్రహించాలి.

614. అన్నముతో ఆకలి తీరుతుంది. జ్ఞానముతో కర్మతీరుతుంది.