ఈ పుట ఆమోదించబడ్డది

459. బాహ్యములో విచిత్రమైనవి, జరుగుటకు వీలులేనివి జరుగు అవస్థయే స్వప్నావస్థ.

460. మనిషి జీవితములో కాలగమనము ఎక్కువ మూడవస్థలుగ జరుగుచున్నది. అవియే ఒకటి జాగ్రత్తావస్థ, రెండు స్వప్నావస్థ, మూడు నిద్రావస్థ.

461. జీవితములో సాధారణముగ జరుగునవి మూడవస్థలే. అయినప్పటికి కొన్ని లక్షలమందిలో ప్రయత్నించు వారికి మాత్రము జరుగు మరియొక అవస్థ గలదు. అదియే యోగావస్థ.

462. మన ఇష్టము ప్రయత్నము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర, మెలుకువ, స్వప్నములు. నీ ఇష్టముంటే, నీ ప్రయత్నముంటే బహు అరుదుగా జరుగునది యోగావస్థ.

463. మనిషి ప్రారబ్ధకర్మము వలన నీ ఇష్టము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర, మెలుకువ, స్వప్నములు. ప్రారబ్ధకర్మకు సంబంధములేనిది నీ ఇష్టము మీద ఆధారపడినది ఒకే ఒక అవస్థగలదు. అదియే యోగము.

464. దేవుడు తనను తెలుసుకొనుటకు మనుషులకు మూడు యోగములను తెలియజేశాడు.

465. మూడు యోగములలో రెండు ధర్మయుక్తమైనవి గలవు. ఒకటి ధర్మములకు అతీతమైనది.

466. ఒకటి బ్రహ్మయోగము (జ్ఞానయోగము), రెండవది కర్మయోగము (రాజయోగము) అనునవి ధర్మయుక్తమైనది. భక్తియోగము మాత్రము ధర్మములకు కూడ అతీతమైనది.