ఈ పుట ఆమోదించబడ్డది

359. ప్రకృతీ పరమాత్మ శరీరధారులయిన జీవాత్మలకు తల్లి తండ్రులని తెలియడమే నిజజ్ఞానము.

360. పురుషుడెవడో, ప్రకృతి ఏదో తెలియనంతవరకు నీవూ, నీ శరీరమూ నీకు అర్థము కాదు.

361. పురుషతత్వముతో నిండినవాడు పరమాత్మ, స్త్రీ తత్వముతో నిండినది ప్రకృతి, నపుంసతత్వముతో నిండినవాడు జీవాత్మ అని తెలియవలెను.

362. ప్రకృతిని, పురుషున్ని, కర్మతో కూడిన జీవున్ని తెలుపుటకే, భూమి మీద స్త్రీ జన్మలు, పురుష జన్మలు, నపుంసక జన్మలు కల్గుచున్నవి.

363. పరమాత్మ అంశయైన జీవుడు ప్రకృతి అంశయైన శరీరముతో కూడుకొన్నపుడు వాడు నపుంసకుడే అగును. ఆ లెక్క ప్రకారము ఆధ్యాత్మికరీత్యా మనమంతా నపుంసకులమే!

364. దైవజ్ఞానమను మందుతిని, నపుంసతత్వమును పోగొట్టుకొని, పురుషతత్వమును సంపాదించుకోవడమే జీవుడు దేవునిగ మారడమని తెలియుము.

365. పదార్థములు ప్రకృతికాగా, వంటచేయువాడు ఆత్మ,కాగా, చేసిన దానిని తినువాడు జీవాత్మకాగా, చేయించునది పరమాత్మ. అయినప్పటికి అన్నిటికి తానే కర్తనని జీవుడనుకొనుచున్నాడు.

366. పరమాత్మ సంకల్పము చేతనే పంచభూతములైన ప్రపంచము మరియు చావు పుట్టుకలు కల్గిన జగతి కల్గినది.