ఈ పుట ఆమోదించబడ్డది

341. అహము బుద్ధికి చిత్తమునకు ఆనుకొని వాటిి వెనుకున్నది. కావున బుద్ధి యోచించిన దానిని, చిత్తము నిర్ణయించిన దానిని నీవే నిర్ణయించావు, నీవే యోచించావని జీవునికి తెలుపుట వలన అన్నీ నేనే అనుకొన్న జీవుడు అన్నీ నేనే చేయుచున్నాను అనుకొనుచున్నాడు.

342. శరీరములో గల 24 ప్రకృతి భాగములలో జీవాత్మను అంటుకొని ఉన్నవి మూడు గలవు. అవియే అహము, చిత్తము, బుద్ది.

343. అహము ఎవరికి అర్థము కాని జీవుని స్వరూపము. అందువలన చాలామంది అహమును గర్వమనుకోవడము జరుగుచున్నది.

344. అహమును ఒక గుణమనుకొను వారు జ్ఞానశూణ్యులు.

345. శరీరము స్థూల సూక్ష్మములుగ ఉన్నది. అందరికి స్థూలము తెలియును కాని సూక్ష్మము తెలియదు.

346. స్థూల శరీరము బయటికి పదిభాగములుగ ఉన్నప్పటికి లోపల కనిపించు గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు మొదలగు అవయవములెన్నో గలవు.

347. సూక్ష్మ శరీరము 15 భాగములైనప్పటికి లోపల కనిపించని గుణములు, కర్మలు మొదలగునవెన్నో గలవు.

348. జీవుడు జీవించు శరీరము స్థూల సూక్ష్మములుగ లెక్కించబడి ఉన్నప్పటికీ, వాటికి అనుసందానమైనవి స్థూలముగ సూక్ష్మముగ ఎన్నో గలవు.