ఈ పుట ఆమోదించబడ్డది

293. మాయ (సైతాన్‌) లేక సాతాన్‌ మానవున్ని మతాలపేరుతో మభ్యపెట్టుచున్నది.

294. మతము దేవున్ని తెలుపలేదు. జ్ఞానమే దేవున్ని తెలుపును.

295. దైవము ఒకమతమునకు సంబంధించినవాడు కాడు.

296. మతము చాటున దేవున్ని ఊహించుకొని, మతమునకు దేవున్ని పరిమితి చేసి మాట్లాడడము అజ్ఞానమే అగును. అన్నిమతములకు అధిపతి ఒకే దేవుడని తెలియడమే జ్ఞానమగును.

297. దేవుడెప్పుడయినా భూమిమీదకు వస్తే భగవంతునిగానే వస్తాడు. అనగా పురుష ఆకారముతోనే వస్తాడు, స్త్రీ ఆకారములో రాడు.

298. స్త్రీ పురుషులలో స్త్రీ ప్రకృతికి, పురుషుడు పరమాత్మకు ఆనవాలని తెలియాలి.

299. దేవుడు భగవంతునిగా భూమిమీదకు వస్తే ప్రకృతి కూడ పురుషజన్మ తీసుకొని తానే భగవంతుడనని నమ్మిస్తున్నది.

300. భూమిమీదకు వచ్చిన దేవుడుగాని, ప్రకృతిగాని తాము పలానాయని తెలియకుండా జాగ్రత్తపడుదురు.

301. భూమిమీదకు వచ్చిన దేవుడు తాను భగవంతుడనని చెప్పడు. అట్లే ప్రకృతి తాను మాయనని చెప్పదు.

302. దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలియనివారు భగవంతున్ని సామాన్యమానవునిగా, మాయను భగవంతునిగా పోల్చుకొందురు.

303. భూమిమీద పుట్టిన ప్రతిజీవి ఆత్మ అంశయే అయినప్పటికి ప్రకృతి లక్షణములను కల్గి ఉన్నది.