ఈ పుట ఆమోదించబడ్డది

215. గుణములను విషకోరలుగల మాయయను సర్పము నిన్ను కాటు వేయుచున్నది. ఆ విషయమునకు సరియైన మందు ఆత్మ జ్ఞానమేనని తెలుసుకో.

216. కామరహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అది నీచేత శోధింపబడుతుంది. కామసహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అదే నిన్ను బాధింపజేస్తుంది.

217. ఆశ నీకు తెలియకుండా నీలోని తృప్తిని బలి తీసుకొంటున్న మహాశక్తి.

218. ఆశను తృప్తి పెట్టాలని ఆశించడములోనే నీ ఆయుస్సు హరించిపోతున్నది. కానీ అది మాత్రం తృప్తి పొందడము లేదు.

219. ఆశ తమకాన్ని తీర్చాలంటే ఆత్మోఫలభ్యంతోనే సాధ్యమౌతుంది కానీ మరిదేనితోడను సాధ్యం కాదు.

220. అవకాశం ఉంటే ఆకాశము కన్నా పెద్దదౌతుంది ఆశ.

221. కోరేది ఈ జన్మలో! తీరేది మరు జన్మలో!

222. మాయకు మనస్సుకు మధ్య పోరాటము పెట్టి మనసుచేత మాయను జయింపజేయుట మానవుడు చేయవలసిన యోగసాధన.

223. మనిషి యొక్క జీవన ప్రయాణములో రెండు మార్గములు గలవు. అందులో ఒకటి (ప్రకృతిమార్గము) మాయమార్గము, రెండవది దైవమార్గము (పరమాత్మమార్గము).