ఈ పుట ఆమోదించబడ్డది

143. జన్మ జన్మకూ తనువు వేరు. తనువు తనువుకూ కర్మ వేరు. కర్మ కర్మకూ మనసు వేరు. మనసు మనస్సుకు బుద్ది వేరు.

144. జ్ఞానం, అజ్ఞానం రెండూ, నీలోనే ఉన్నాయి. కాని అజ్ఞానపు సంచిలో జ్ఞానం మూట గట్టబడి ఉంది.

145. దైవ సేవకై మనముండవలెను. కానీ మన ప్రయోజనముకై దైవముండకూడదు.

146. ఫలమాశించే కార్యము బంధము కలిగిస్తుంది. ఫలమాశించని కార్యము ముక్తిని కలిగిస్తుంది.

147. తల్లిగర్భము నుండి తనువు, బ్రహ్మగర్భము నుండి ప్రకృతి ఉద్భవించినది.

148. ప్రకృతి సంబంధమైన ప్రతి శరీరములందు, పరమాత్మ సంబంధమైన పురుషులిద్దరుంటారు. వారే క్షరాక్షరులు.

149. స్త్రీ పురుష సంయోగ ఫలము దేహకారణము. పాప పుణ్య సంయోగ ఫలము జీవకారణము.

150. నీవు నీ కర్మమనుభవించుటకై నీ శరీరము పుట్టింది కాని నీ శరీరం కర్మ అనుభవించుటకై నీవు పుట్టలేదు.

151. కర్మంటే ఏమిటో తెలుసుకొంటే కర్మనుండి విముక్తుడవు కాగలవు. మనస్సంటే ఏమిటో తెలుసుకొంటే మనస్సును జయించగలవు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకొంటే ఆత్మను చేరగలవు.

152. అన్ని పనులు నీ ఇష్టప్రకారము జరుగుతున్నాయనుకొంటున్నావు. నిజమేకానీ నీ ఇష్టం కర్మ ప్రకారం కలుగుతున్నది.