ఈ పుట ఆమోదించబడ్డది

49.అజ్ఞానజనితమైన పశుపక్ష్యాదులు ఆహార, నిద్ర, సంభోగ విషయ కార్యకలాపాలలో జీవిస్తున్నాయి. ఎంతో జ్ఞానమున్న మానవుడు అలాగే చరిస్తే వాటికి మానవునకు తేడా ఏమున్నది?

50.అహమును అణచి, కాయమును కర్తవ్యానికి వదిలినవాడే అసలైన కర్మయోగి.

51. విషయమనే గాలానికి సుఖమనే ఎరను తొడిగి ఆశజూపి, కర్మమనే బుట్టలో చేపయనే జీవున్ని బంధించుచున్నది మాయ అను జాలరి.

52.కర్మమనే తప్పుకు ప్రకృతియనే చెరసాలలో జీవుడు శిక్షను అనుభవిస్తున్నాడు. కర్మరహితమైనపుడు జీవునకు మోక్షమను విడుదల లభించును.

53. ఇరుసును ఆధారము చేసుకొని చక్రము చలించురీతిగా ఆత్మనాధారము చేసుకొని కర్మ గుణచక్రములు చలించుచున్నవి.

54. దేవుడుంటే చూపించమని దెబ్బలాటకు దిగకు. కర్మను వదులు, క్షణాల్లో కనిపిస్తాడు. అపుడు నీవే దేవునివి.

55.గుణాలను ఆజ్ఞాపిస్తాడు గురుదేవుడు, గుణాల ఆజ్ఞలో చరిస్తాడు ధరజీవుడు.

56. గుణాతీతుడైన దేవున్ని గుర్తించాలంటే, నీవు కూడా గుణాతీతుడవైతేనే సాధ్యపడుతుంది.

57. గుణాల ఊబిలోపడి కూరుకుపోవుచున్న జీవా! ఆత్మజ్ఞానాన్ని అందుకో నిన్ను బయటకు అదే లాగుతుంది.

58.దేవుని శక్తిచే ప్రభవించిన ప్రకృతి శరీర సహాయముతో బ్రతికి బట్టగడుతున్న జీవా! దేవుడులేడని భావించవద్దు.