ఈ పుట ఆమోదించబడ్డది

798. ఆకాశానికి అంతులేదు అనుచుందుము. అకాశానికే అంతు లేనపుడు దానిని పుట్టించిన వాడు మరీ అంతులేనివాడు మరియు అంతుబట్టనివాడు.

799. "నీ ప్రాణానికి నా ప్రాణమిస్తా" అంటారు. కానీ అలా ఎవరికైనా సాధ్యమవుతుందా? నీ ప్రాణము నిజానికి నీదేనా? నీదికాని దానిని ఎలా యివ్వగలవు? అందువలన మాట అనినా ఎవరూ ప్రాణము ఇవ్వలేక పోతున్నారు.

800. శీలము పోయిందంటారు. శీలము అంటే ఏమిటో తెలుసా? శీలము నీవు ఉంచుకున్నది కాదు, ఎవరైన తీసుకొంటే పోయేది కాదు. అది నీ తలలోనిది.

801. పోలీసులు లాఠీలతో దొంగను భయపెట్టవచ్చును. కానీ వాని తలలోని బుద్ధిని మార్చలేరు. చేతితో చేయలేనిదానిని నోటితో చేయవచ్చునని పెద్దలన్నారు. కావున పోలీసులు లాఠీలను వదలి మాటలతోనే చెప్పాలి.

802. దొంగలు మాటలతో వినరు. వారికి కావలసినవి లాఠీల దెబ్బలేనని కొందరు అనుకోవచ్చును. కానీ అది సరియైన పద్ధతి కాదు.

803. మాటలు మంత్రములాంటివి. ఏ మంత్రము ఏ రోగమునకు తెలియకపోతే మంత్రము వృధాఅగును. అలాగే దొంగకు కావలసిన మాటలు చెప్పకపోతే చెప్పిన మాటలు వృధాఅగును. వాడు మారడు.

804. ప్రతిమాట మంత్రమేనని యోగి వేమన కూడ అన్నాడు. దొంగతనమను రోగమును నయముచేయుటకు తగిన మాటలనే ఉపయోగించాలి.