ఈ పుట ఆమోదించబడ్డది



18. అహంకారము తొలగక అజ్ఞానము అంతరించదు. అజ్ఞానము అంతరించక ఆత్మదర్శనము కాదు.

19. పంచభూతములచే నిర్మింపబడిన శరీరములు పంచభూతముల వలనే నశిస్తున్నాయి.

20. అష్ట ఐశ్వర్యాలతో తులతూగేవారిని చూచి నేను అలాలేనని అసూయచెందితే ప్రయోజనమేమి? ముందు జన్మలలో వారు చేసుకొన్న పుణ్యఫలమే వారినాస్థితియందుంచినది.

21. అపారమైన సముద్రములోని జలబిందువువంటిది శరీరములోని జీవాత్మ.

22. బాహ్యపూజలకన్నా భావపూజయే దేవునికి ఇష్టము.

23. ఆహారపదార్థముల ప్రభావము వలన గుణప్రభావములు మారవు. కానీ గుణప్రభావము వలన ఆయా ఆహారముల తినుటకు అభిలాషకల్గును.

24. చేప దాని స్వస్థానమైన నీటియందుంటేనే దానికానందము అలాగే మనస్సు దాని స్వస్థానమైన ఆత్మయందుంటేనే దానికానందము.

25. సంకల్పాల రాహిత్యము చేసుకోవడమే సత్యమైన బ్రహ్మయోగము.

26. ఆడంబర పూజలన్ని అజ్ఞానానికి దోహదం చేస్తాయి. కానీ ఆత్మభావాన్ని అందించలేవు.

27. పాత్ర కడిగి చేసిన పాకమూ, పాత్రలెరిగి చేసిన జ్ఞానదానము పరిశుద్ధ ఫలమిచ్చును.