ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

69

లేడు. ప్రజాప్రతినిధి ప్రభుత్వము 1933–వరకు అన్ని దేశములందువలెనే సాగినది. ఆసంవత్సరము నందు హిట్లరు పార్టీవారు- వారే నాజీలు- ప్రభుత్వమునకు వచ్చిరి. సర్కారు ఉద్యోగములలో, వ్యాపారములలో, వృత్తులలో అన్నిటను యూదులకు, లిబరలులకు, సోషలిస్టులకు తావులేకుండ జేసిరి. 1933-లో, 1934-లో ప్రజలు పదింట తొమ్మిదిపాళ్ళు వోట్లువేసి యీపార్టీయందు తమకు విశ్వాస మున్నదని ప్రకటించిరి. 1934 ఆగస్టులో అదివరకు అధ్యక్షుడుగా ఉండుచుండిన హిండెంబర్గు చనిపోయెను. ఆ స్థానమును భర్తీచేయకుండ హిట్లరు తనహోదాలో దానిని లయముచేసివేసెను. నాటినుండి జర్మనీలో హిట్లరు 'నాయకుడు'గా - వీనినే ఫూరరనుటయుకలదు. ఏకపక్షనాయకుడై , సర్వాధికారధూర్వహుడై పనిచేయుచున్నాడు.

ఇప్పటికిని ఇటలీలో పరంపరాగతప్రభు వున్నాడు. కాని అచ్చటను ముస్సోలినీ 'డ్యూస' నే పేరుతో ఏకపక్ష నాయకుడయి సర్వాధికారధూర్వహుడై యేలుచున్నాడు. నిజమునకు హిట్లరుకు ముస్సోలినీ గురువు. ఇతడే నేటి ఫేసిస్టు విధానమును 1922–వ సంవత్సరమున ఇటలీలో ప్రవేశపెట్టెను. పెట్టుబడిదారులు కర్మకరులు పోరాడుకొని జాతీయసౌభాగ్యమును చెడుపుదురను సిద్ధాంతమును ఆధారముచేసి సమభాగములుగా వారును వీరును అధికారమునకు వచ్చునట్లు చూచునుద్దేశమును ముందిడుకొని యితడు సంస్కారము లారంభించెను. వీరిద్దరకు తగవుతీర్చే యధికారిగా తనపార్టీని నియమించెను.