ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 29

సీ. కైవార మొనరింతు గంభీరసాహిత్య ఘంటాపథోద్భాసుఁ గాళిదాసు
వర్ణింతు నుజ్జ్వలవాణీసుధాపూర పాథోధిపరిబాణు భట్టబాణుఁ
బ్రణుతింతు నుద్దండభాషాసమాక్షిప్త హరబాహుకేయూరుఁ డగు మయూరు
సన్నుతిఁ గావింతుఁ జాటుధారాప్రౌఢి కోమలతాయత్తు సోమదత్తు
గీ. భక్తి నంజలి రచియింతుఁ బ్రవరసేన
భాస శివభద్ర భవభూతి భట్టహర్ష
భారవి మురారి హేరంబ చోరులకును
మఱియుఁ దక్కిన సుకవుల మదిఁ దలంతు. (ఆం) 124

శా. క్రీడాలోలత దంతకోరకశిఖిం గీలించి భూచక్రమున్
గ్రోడగ్రామణి మించి యెత్తి ఫణు లక్షుద్రానుమోదంబునన్
జూడాభోగము లెత్తి చూడఁగ దిశాశుండాలరాణ్మండలిన్
వ్రీడం బొందఁగఁజేయు దంతిముఖు నిర్విఘ్నార్థమై కొల్చెదన్. (ఆం) 125

శా. చంచత్కేళిసరస్తటీమరకతచ్ఛాయాకదంబంబు గ్రొ
మ్మించు ల్సోఁకినఁ దమ్ము లిమ్ములను గిమ్మీరంబులై యుంట సం
ధించు న్వాసనఁ జంచరీకములు మందీభూతసందేహతన్
సంచారించుచు నల్లకల్వవిరుల్ ఝంకారశంకారులై. (ఆం) 126

శా. ధారాపాతవిభాతి శీతకరకాంతస్ఫారగేహంబు లీ
యూరం జంద్రికమీఁదఁ బర్వనురువున్[?] వ్యూఢాంబుధారాతతిన్
జేరున్ జాతకపంక్తి చిత్తములు రంజిల్లన్ మయూరంబులున్
సారస్యంబుల లాస్యము ల్మెఱయు నుత్సాహించి భూపాలకా! (ఆం) 127

సీ. పురుహూతవిస్ఫూర్తి భూమండలంబెల్ల భుజవిటంకంబునఁ బూనినాఁడు
గీర్వాణదుర్వారుఁ గేశిదానవుఁగొట్టి విజయలక్ష్మీయుక్తి వెలసినాఁడు
లచ్చినెచ్చెలికాని లలితోరుపీఠికఁ బొడమిన పూఁబోడిఁ బొందినాఁడు
నవయుగద్వీప భూనాథచూడారత్న మిత్రశాసనలీల మెఱసినాఁడు
గీ. విమలకీర్తిమందాకినీ వీచినికర
పూరపాతాళ మర్త్యవిబుధనివాసుఁ
డై కరంబొప్ప సోమాన్వయప్రభుండు
చారుకీర్తి పురూరవశ్చక్రవర్తి. (ఆం) 128