ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 17

నడుఁగక యడు గెత్తి నడచినయందాఁక గొనలుపూఁదీగె గా దనఁగ వశమె?
కలికి తనూరేఖఁ గదిసి కన్గొనుదాఁక ఘనవనలక్ష్మి గా దనఁగ వశమె?
గీ. యువిద సఖిమీఁద వెడ వ్రాలి యున్నదాఁక
నొనరు తొలుకారు మెఱుఁగు గా దనఁగ వశమె?
వెలఁదిగుణములు సఖులచే వినినదాఁక
నంగసంభవుమాయ గా దనఁగ వశమె? (జ) 74

చ. అలికుల మెల్ల వేణియును హంసములెల్లను మందయానముల్
జలజము లెల్ల నెమ్మొగము జక్కవలెల్లను చన్నుదోయి యా
పులినము లెల్లఁ బెన్బిఱుఁదు పుష్పములెల్లను మేనివాసనల్
పొలఁతుక నాశ్రయించుకొనిపోయె నవన్నియు నన్నివంకలన్. (జ) 75

సీ. ఈశుచేఁ గాంచి సాహిత్యవిద్య ధరిత్రి నిల్పినయట్టి పాణిని భజించి,
శ్లోకార్థమునఁ జంద్రజూటు మెప్పించి యి ష్టార్థము ల్గొన్న మల్హణు నుతించి,
గద్యంబు చెప్పి శంకరునిచేఁ గరములు ప్రతిభతోఁ బడసిన బాణుఁ దలఁచి,
శతకంబుఁ చెప్పి భాస్కరుని మెచ్చఁగఁ జేసి యురుదేహుఁ డైన మయూరుఁ గొలిచి,
తే. భవుని మెప్పించి కన్నులు పడసి తెచ్చి
వనిత కిచ్చిన కాళిదాసునకు మ్రొక్కి
హరుని వినతులచేఁ బాస లాడఁజేసి
నట్టిధట్టుని నన్నయభట్టుఁ బొగడి. (జ) 76

క. ఉడురాజు కొలువు దీరిన
నుడుగణపరివారసమితి నొఱపుగ ననుపన్
వడి వచ్చుకటికవాఁ డనఁ
బొడజూపెన్ వేగుఁజుక్క పురుహూతుదెసన్. (జ) 77

చ. కలిసి యొకళ్ళొకళ్ళు కసుగందనివేడ్కలఁ జూచువేళ ఱె
ప్పలు మఱువయ్యెనే నవియుఁ పాయుట, తత్సుఖపారవశ్యులై
పలుకకయుండుటే యలిగి పైకొనకుండుట, యంతె గాని తొ
య్యలియు విభుండుఁ బాయుటయు నల్గుట నాఁగ నెఱుంగ రెన్నఁడున్. (జ) 78