ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 ప్రబంధరత్నావళి

విరహతాపంబున వెగ డొందుటయె కార్శ్య, మరుచి యేమిటిమీఁదియాశ లుడుగు,
టెంద ఱుండియు వారి నెఱుఁగమి నిర్లజ్జ, గమనంబు తనయిల్లుఁ గదలి చనుట,
గీ. వలపు తల కెక్కి మది తన వశము గాక
పరవశత్వంబుచే డిల్లఁబడుట మూర్ఛ,
పొందు లేకున్నఁ బ్రాణంబు పోవు ననుట
మృతియు, నని దశావస్థలగతులు నొప్పు. (జ) 64

క. చూచుట తలఁచుట కోరుట
కాచుట కృశ మౌట రుచులు గానమి సిగ్గున్
ద్రోచుట నడచుట మూర్ఛా
ప్రాచుర్యము మరణ మనఁగఁ బదియు నవస్థల్. (జ) 65

సీ. పట్టెకంకటి దూదిపఱుపు ముక్కలిపీఁట యగరుధూపము వెలు వైనదివ్వె,
పూలు గంధము గందవొడి పున్గుబరణియ జాలవల్లిక వన్నెమేలుకట్టు,
తమ్మపడిగ పాన్పు తలగడ చిటిచాఁప పానఱా యడపంపుసంచి గిండి
గొడుగు పావలు గాజుగుడిగి సున్నపుఁగ్రోవి గందపుఁజిప్పు బాగాలబరణి,
గీ. గిండిచెంబును చిరుతేరగిన్నె బోన[?]
నిలువుటద్దము వీణియ చిలుక సురఁటి
మిద్దెయిల్లును ముంజూరు మిగిలినట్టి
పంచటోవరి గల కేళిభవనమునను. (జ) 66

సీ. పర్వతతరునదీపక్షినామంబుల నేకన్నెఁ బిలిచెద రింటివారు?
పొడవు కొంచెము వక్రమును బొందు నేకన్నె ................ వక్రములు తొడలు?
పెదవియు నధికంబు పింగళ మై గుంట కన్నులు గల్గి యేకన్నె మెలఁగుఁ?
గలకంఠమును బాదకమలంబులును గడుఁ గఠినంబులగుచు నేకన్నె కమరు?
గీ. నిదురవోవంగ నవ్వుచు నిడుదయూర్పు
లడర నేకన్నె లేడుతు రశనవేళ?
మీసములు గల్గి చనుదోయిమీఁద రోమ
ములును గల్గును నేకన్నె బొసఁగ దదియు. (జ) 67