ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్పంకేజంబున నిన్నుఁ గానక మనస్తాపంబున న్మూఢులై
మంకుల్ గొందఱు గాథఁ దప్పుదురు రామా! రాజచూడామణీ! (ఆం) 538

మ. తినదే చెట్టలు యాకు మేఁక, గుహగొందిన్ పాము నిద్రింపదే,
వనవాసంబునఁ బక్షులన్ మృగములన్ వర్తింపవే, నీటిలో
మునుఁగం జూడవె మత్స్యకచ్ఛపములున్, మోక్షార్థులై ముక్తికిన్
మనసే మూలము నీదు భక్తికిని రామా! రాజచూడామణీ! (ఆం) 539

మ. పరమార్థజ్ఞుఁడు సర్వభూతచయమున్ బ్రహ్మస్వరూపంబుగాఁ,
బరకాంతామణిఁదల్లిగా నహితునినే బ్రాణోక్తబంధుండుగాఁ,
బరికించున్ సమలోష్టకాంచనమతిన్ భావింపఁడాత్మన్ జరా
మరణ క్లేశభయంబు నొంది రఘురామా! రాజచూడామణీ! (ఆం) 540

మ. బుధధాత్రీజ వికాసముల్ గుణలతాభోగ ప్రియావాసముల్
మధురస్త్రీ సుఖహాసముల్ పికవచో మాధుర్య విన్యాసముల్
విధురప్రాయ తుషార భాసములు విద్విడ్భాతి సంత్రాసముల్
మధుమాసంబులు నీ విలాసములు రామా! రాజచూడామణీ! (ఆం) 541

మ. రణరంగంబున వజ్రకాయమున సంరక్షించు సంసార దా
రుణ బేతాళభయంబు పాఱ నణఁచున్ రోగాగ్ని సంతాపమున్
క్షణమాత్రంబునఁ బాయఁజేయవె భవత్కల్యాణ నామావళుల్
మణిమంత్రౌషధసేవ పుణ్యులకు రామా! రాజచూడామణీ! (ఆం) 542

గ్రంథనామము, కర్తనామము తెలియరానివి
సీ. అఖిల లోకానందుఁడగు చంద్రుఁ డెందేనిఁ గలిగె నుజ్జ్వలఫేనకంబు మాడ్కి,
నైరావతాదిమహాకరు లెందేనిఁ బ్రభవించె మకరశాబముల పగిదిఁ,
గమనీయసురతరుసముదయం బెందేని జనియించె శైవాలచయము భంగి,
భువనైకమాత మాధవుపత్ని యెందేనిఁ బొడమె మాణిక్యంపుబొమ్మ పోల్కి,
గీ. నాది మత్స్యకూర్మములు విహారలీలఁ
దనరు నెందేనిఁ బ్రకృతిసత్త్వముల కరణి
నట్టి యంభోధి యొప్పారు నద్భుతైక
సారమహనీయమహిమ కాధార మగుచు. (ఆం) 543