ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. కవిత సెప్పినఁదగుఁ గాక కవిసి నోరి
కొలఁదు లివ్వల నవ్వలఁ గూర్చి తెచ్చి
దిట్టకూళతనంబున వట్టిబిగిని
గావ్యమని చెప్ప మెత్తురే కవిజనములు. (జ) 508

సీ. వనిత యూర్పులచేత వావిలి వికసించెఁ బాటఁబ్రేంకణము లేఁబరువమయ్యె,
నాతుక చూచిన నలువొత్తెఁ దిలకంబు గొమరారె మాటలఁ గొండగోఁగు,
సతిముఖరక్తిచే సంపంగి సొంపెక్కె నవ్విన సురపొన్న మవ్వమలరె,
నెలనాఁగ కౌఁగిట నిగురొత్తెఁ గురవకం బంటినఁ జెలువొందె నామ్రతరువు,
గీ. పొలఁతి పుక్కిటిమధువునఁ బొగడ వొలిచెఁ
గాంతపదసంగమున నశోకంబు విరిసెఁ
గాననములోన జాతి యొక్కటియె తక్క
భూజములుఁ దీఁగలునుఁ బూచి పురువులయ్యె. (ఆం) 509

సీ. వేదాదులగు మహావిద్యలన్నియుఁ గూడి మూర్తిమంతంబులై మొనసి కొలువఁ,
గ్రతుమరీచ్యంగిరఃకణ్వాదిసంయముల్ పలుమాఱుఁ గనుసన్నఁ బనులు సేయ,
సురసిద్ధకిన్నరగరుడవిద్యాధర యక్షాదు లంతంత నభినుతింప,
నారదవిశ్వసనత్కుమారాంగిర శ్శతరుతు లుభయపార్శ్వముల మెఱయ,
గీ. భాషతోఁగూడి యానందభరితుఁడగుచు
సత్యలోకేశ్వరుండందు సంస్తుతింప
నిమ్మహాసృష్టికెల్లను నితఁడు కర్త
చూడుమీ! బ్రహ్మలోకంబు సుభగమూర్తి! (ఆం) 510

సీ. హరి యురస్స్థలిఁబోలెఁ గర మొప్పఁ జూచితే భాసురకమలాధి వాసమగుచుఁ,
ద్రిదివంబుఁబోలె నొప్పిదమయ్యెఁ జూచితే మకర కచ్ఛప మహా మహిమ గలిగి,
గగనంబువోలె నక్కజమయ్యెఁ జూచితే రాజహంసస్ఫూర్తి రమణఁ గలిగి,
యాశాతటమువోలె నసలారెఁ జూచితే బంధుర కుముదవిభ్రమము గలిగి
గీ. యతిమనోహర మందమారుత విహార
లోల కల్లోలమాలికాందోళకేలి