ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. రాసి సహస్రభాను ఫణరత్నములెల్లను బోవఁదన్నుచున్
వాసరభోగిఁ గాలఫణివైరి కడున్ వడి నొక్కి నక్కుగాఁ
జేసినఁ గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజృంభణం బనం
గా సముదగ్రతం బొలిచెఁ గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్. (జ) 446

సీ. వలమానచంపకోత్పలమాలికాది సం గ్రథనచాతురి నెఱ కవులఁ బోలి
దళము గెలిచినసూత్రమున నూల్కొల్పు నే ర్పున యోధవీరుల పొలుపుఁ దెలిపి
ఖండితత్వమున రాగము గల పల్లవా వలిఁగోయుటల వేశ్య వలపు నెఱపి
పలుతావులరసి యెత్తులు పచరించు పెం పున జూదరుల ఠేవ పొడమఁ జేసి
గీ. తమ నిజాంగ మరీచులు తత్తదన్య
పుష్పములసావి నిక్కంపుఁబువ్వులమరు
పేరఁ బేర్కొనుపౌరులఁ గేరికేరి
నవ్వుదురు పుష్పలావికా నలినముఖులు. (జ) 447

సీ. వినుతమాణిక్యవందనమాలికాకాండకల్పితరోహితాకారరేఖ
జాలకానననిర్యదాలోలవాసనాగరుధూపపోషితకంథరాళి
చంద్రశాలాతిగర్జన్మృదంగధ్వానవిరచితపరిఘోషనవిభవలహరి
సంభోగసంరంభసమయవిచ్ఛిన్నముక్తాహారమణికృతకనకనికర
తే. మదనమదభారమంథరమత్తకాశి
నీదృగంచలసంచితనిబిడచంచ
లాలతాతల్లజయునై యిలావివిక్త
వర్ష యననొప్పుఁ గాకుత్స్థవంశ్యనగరి. (జ) 448

ఉ. వేదపురాణశాస్త్రములు వేడుకవిద్యలు, సర్వయజ్ఞసం
పాదనశక్తి నిత్యనిరపాయవిధి ప్రతిపాలనంబు, దా
రాదిమతత్త్వముం గనుట హస్తగతామలకంబుఁ గంట, ధా
త్రీదివిజావతంసుల కరిందమ మన్పురిఁ గల్గువారికిన్. (జ) 449

చ. సరళదలత్సరోరుహససారపరాగపరంపరాపరి
స్ఫురితసువర్ణవర్ణమును బూరితదిఙ్ముఖహంసనాదమే
దురమునునై యగడ్త కనుదోయికిఁ బండువుసేయ మ్రోయుఁ ద
త్పురవరలక్ష్మి యెప్పుడును బూనెడు కాంచనకాంచియో యనన్. (జ) 450