ఈ పుట ఆమోదించబడ్డది

13


ర్వణఛందమును జూచియే కైకొనిరో చెప్పలేదు. ఇది యధర్వణుని దగునాఁ డాతఁడు నన్నిచోడనికంటెఁ దర్వాతివాఁడగును. మఱియు వారే క్రీడాభిరామమును ముద్రించుచు దానికి నాందిగా “అంబరసీమఁ దారలు" అను పద్యము నతకరించి యది 'యధర్వణుని భారత విరాటపర్వమున మొదటి యాశ్వాసము నుండి' యెత్తఁబడినట్లు వ్రాసినారు. వారు దాని నధర్వణభారత విరాటపర్వ ప్రథమాశ్వాసమునఁ జూచిరేమోగాని, యిందు 'దామరాజు సోమయభరత' మండలిదిగాఁ గూర్పఁబడియున్నది. ఏది సత్యమో?

అన్నమయ్యంగారు, తాళ్లపాక:— ఈతఁడు రా. బ. కం. వీరేశలింగము పంతులుగారి కవులచరిత్ర ప్రథమభాగమునఁ జేరవలసినవాఁడు. పదునాల్గవశతాబ్దిలో నించుమించుగా శ్రీనాథునికాలమున నున్నవాఁడు. తిరుపతి తామ్రశాసనమునుండి ఈ విషయ మెఱుఁగఁబడును.

అప్పన:— ఈతఁడు భోజమహారాజుచే సంస్కృతమున రచియింపఁబడిన చారుచర్యను దెలుఁగుసేసినవాఁడు. ఏనాఁటివాఁడో తెలియదు. రచనమును బట్టి ప్రాచీనుఁ డని యూహించితిని. గ్రంథారంభ మిట్లున్నది.[1]


క.

ప్రత్యూహబహుళతిమిరా
దిత్యుఁడు శ్రీకీర్తిభారతీసంతతసం
పత్త్యున్నతుండు శ్రీహరి
నిత్యుఁడు నాగాంబయప్పనికిఁ బ్రియ మొసఁగున్.


సీ.

విద్వన్నుతుండు భారద్వాజగోత్రుఁ డాపస్తంబసూత్రుండు పరమపుణ్య
వినులోజ్జ్వలాంగి గోవిందార్యునకుఁ గులద్వయశిరోభూషణధర్మచరిత
నాగమాంబకుఁ గూర్మినందనుఁ డప్పయమణిమౌళి సింగననామాత్యుమేన
యల్లుఁడు ధార్మికుఁ డనఘుండు శ్రీవల్లభాచార్యుతమ్ముండు హరిపదాంబు


గీ.

జాతషట్పదుఁ డుభయభాషాకవిత్వ
మానవైదగ్ధ్యుఁ డప్పయమంత్రివిదుఁడు


  1. ఇది శ్రీముక్త్యాల ప్రభువులగు శ్రీ రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాదబహద్దరు గారి పుస్తకశాలలో నున్నది. తంజావూరు పుస్తకశాలలో గ్రంథారంభము కొంచె మున్నది.