ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గహనంబులోన నగహనమై చనుఁ గాక చమరవాలములు కేశముల సరియె?
ఘనములయొద్ద నఘనములై మనుఁ గాక తళుకులు మించుగాత్రముల సరియె?
తే. కలువ లొండెనుఁ జక్రవాకంబు లొండెఁ
దేటు లొండెనుఁ బువ్వారుఁదీఁగె లొండెఁ
గాక యని ప్రస్తుతింప నా కాంచిలోన
సతులు విలసిల్లుదురు హేమలతలుఁ బోలె. (ఆం) 421

చ. రసికత సోలిసోలి యనురాగరసంబునఁ దేలితేలి యా
కసములు మెట్టిమెట్టి తమకంబునఁ గాంతలఁ బట్టి పట్టి యా
దొసకులఁ జిక్కి చిక్కి కడుదూరముగాఁ జని తక్కితక్కి పై
కొసరెసఁగం జకోరికలు కోరిక లీరికలొత్త మత్తిలున్. (ఆం) 422

సీ. రాలు కారాకులఁ గ్రాలుమాఱాకులఁ గలయ భూజములెల్లఁ గానరాఁగ,
సతులడెందంబుల నతులకుందంబుల వికసనం బాత్మకు వ్రేగుఁగాగఁ,
బొలుచుదారకముల గెలుచు కోరకముల విరవాదితీగెలు విఱ్ఱవీఁగఁ,
జంపకజాలంబు నింపక యోలంబుఁ గొని దవ్వులనె తేఁటికొలములాఁగ,
తే. నెంతయును వింత యిది యన నంతనంత
సంతతాక్రాంత మదన నితాంతతాంత
కాంతకాంతాకదంబక స్వాంతములకు
సంతసము నింప వచ్చె వసంత మంత. (ఆం) 423

సీ. శబ్దశాసనకావ్యసంఘట్టన క్రమా నందిత బుధవర్యు నన్నపార్యు,
నుభయభాషా రచోన్నిద్ర భద్ర వ చోరాజిఁ దిక్కనసోమయాజి,
లక్ష్యలక్షణకళాలంకార సౌభాగ్య సత్కావ్యవిన్యాసు శంభుదాసు,
ఛందోనిబంధన చాతురీధౌరేయ వాగ్ధాము వేములవాడ భీము,
తే. రసికజనపద్మ దిననాథు రంగనాథుఁ,
బ్రకటకృతికర్మనిస్తంద్రు భాస్కరేంద్రు
నమితరసభావు శ్రీత్రిపురారిదేవు
సూక్తితిమిధాము నాచనసోముఁ దలఁతు. (ఆం) 424

సీ. శ్రుతులును నిర్జరస్థితులును మగిడింప నిగడంపఁ జాలు నీ నేర్పుకలిమి,
ధరణియు రిపుగర్వసరణియు ధరియింప హరియింపఁ జాలు నీ యలవుకలిమి,