ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. వెనుకకుఁబోక యీయనక వేసటఁ బొందక పంక్తిపంక్తికిన్
బెనుపక కానమిన్ బ్రమసి బెగ్గిల కంతయు మున్న చూచుచున్
గనుఁగొని యక్షరాక్షరము కందువదప్పక యేకచిత్తుఁడై
యనుపమ భక్తితోఁ జదువు నాతని వాచకుఁడండ్రు భూవరా? (జ) 401

సీ. శృంగారవిభుఁడని చెప్పంగ నేటికి భావజుఁ గొడుకుఁగా బడసె ననినఁ?
గారుణ్యనిధి యని గణుతింప నేటికి సృష్టిరక్షణ నిత్యశీలుఁ డనినఁ?
బరమపావనుఁడని ప్రణుతింప నేటికి గంగఁ బాదంబునఁ గాంచె ననినఁ?
ఘనవైభవుండని కొనియాడ నేటికిఁ గలిమిముద్దియ కులకాంత యనిన?
గీ. విష్ణుఁడఁట యడంగ నేటికి విశ్వమూర్తి
యనఁగ? నచ్యుతుఁడఁట నిత్యుఁడనఁగ నేల?
యని మునీంద్రులు గొనియాడ నతిశయిల్లు
నమ్మహాత్ముండు సర్వలోకాధికుండు. (జ) 402

శా. శ్రీరామాస్పదమైన పేరురముపై శ్రీవత్సచిహ్నంబుఁ దా
నారూఢంబుగఁ దాల్చి శ్రీకిఁ దగుచిహ్నల్ గల్గువాఁ డౌట సొం
పారం దెల్లమి సేయుదేవుఁడు కృపావ్యాసక్తుఁడై మామక
ప్రారంభంబు నిరంతరాయశుభసాఫల్యంబుఁగాఁ జేయుతన్. (జ) 403

శా. శ్రీనిత్యాశ్రయమై మహామధురిమ శ్రీపేర్మికిన్ సంతత
స్థానంబై యనపాయమై యనఘమై తాపఘ్నమై స్వచ్ఛమై
యా నారాయణుశుద్ధసత్త్వగుణ మీ యాకారముం దాల్చెనో
నా నొప్పారుఁ బయఃపయోనిధి నిఖిలానందైకసంధాయియై. (ఆం) 404

శా. శ్వేతద్వీపము దుష్కృతాంధతమసచ్ఛేదక్రియాదీప ము
ద్భూతాఖండసుఖస్వరూప మమరస్తోమాద్భుతాటోప ము
త్ఖాతామర్త్యరిపుప్రతాపము నతధ్వస్తోగ్రసంతాప మ
బ్జాతాక్షప్రియరూప మార్యహృదయప్రక్షేప మొప్పుం దగన్. (ఆం) 405

క. సుతుఁడు దటాకము దేవా
యతనము నల్లిల్లు నిధియు నారామము స
త్కృతియు ననుసంతతుల యం
దతిశయము ప్రబంధ మెపుడు నక్షయమగుటన్. (జ) 406