ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సకలమోహన సంగీతచతురుఁడగుచు
వేణుగానంబుఁ బ్రకటించె విశ్వగురుఁడు. (జ) 396

సీ. లసదురఃస్థలంబునఁ బసనైన గళమున విలసిత లీల శ్రీ నిలిపినారు,
చరణంబుపట్టున జడలలో చుట్టున ననువొందఁగా గంగ నునిచినారు,
భవ్యగుణంబున దివ్యదేహంబున నొఱపు మీఱఁగ భూతి మెఱసినారు,
తిరముగా మూఁపునఁ గరమొప్పురూపునఁ బొలుపొందఁగా ధాత్రిఁ బూనినారు,
తే. తెల్ల గల యిండ్ల నిలిచి వర్తిల్లినారు
ఇరువు రిరువుర భార్యల నేలినారు
పెక్కు మొగములకొడుకులఁ బెనిచినారు
హరిహరులు వీరు సర్వలోకాధిపతులు. (జ) 397

[గూఢచతుర్థి]



సీ. వలపుల బొమల మై నిలుకడఁ గన్నులఁ బుష్పచాపధ్వజ స్ఫూర్తిగలిగి,
కాంతి గంధంబునఁ గరములఁ దనువల్లిఁ గనకపంచమదామ గరిమఁదాల్చి,
కురులను బొడ్డునఁ బిఱుఁదునఁ గుచమున ఘనసరసీచక్రగతి వహించి,
నేర్పున నగవున నిగ్గున మొగమున శారదామృతభాను సమితినొంది,
గీ. కౌను నఖములసొబగును గల్గి చూపు
హరిమణి శ్రీసమానత నతిశయిల్లి
రూపశుభలక్షణముల నేపుమిగిలి
వెలఁదు లమరుదు రవ్వీట వేడ్కతోడ. (జ) 398

చ. వలపెటువంటిదో ముసలివాఁడనవచ్చునె? యద్దిరయ్య! ప
ల్కుల జవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్ల ప్రొద్దును మొగంబునఁ గట్టినయట్ల యుంటు నీ
నలువకు నంచుఁ గాముకులు నవ్వువిధాత శుభంబు లీవుతన్. (ఇ) 399

చ. వెడవెడఁ గౌఁగిలించుచును వేమఱుఁ జుంబనలీల మోవియుం
దొడుకుచు బుజ్జగించుచును దొంగలిచూపుల లోన సిగ్గుతో
సుడివడు భీతి వాపి మదిసోఁకునకున్ సొగియంగఁజేసి యే
ర్పడ రతిసౌఖ్యముల్ మరపె బాలలకుం గమలాక్షుఁడింపుగన్. (ఆం) 400