ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 ప్రబంధరత్నావళి

గొప్పయగు శుద్ధపారదఘుటిక యనఁగఁ
జొక్కమగు కాంతి వేగురుఁజుక్క దనరె. (జ) 353

ఉ. చెంచెతగుబ్బచన్నుఁగవ శీఘ్రతరంబుగ నంతనంత వ
ర్తించిన యౌవనోపగమ జృంభణమెక్కిన నంతకంత శో
షించెను దానినెన్నడుము జీవితనాథుఁడు వానివిల్లునున్
జెంచులరాజులున్ సవతిచేడియపిండును బక్కణంబులన్. (జ) 354

గీ. తొలుత ముంగిళ్ళఁ గర్పూరధూళిఁ దుడిచి
సహజచందనజలములఁ జాఁపి చల్లి
చారుగృహములఁ గమ్మకస్తూరి నలికి
మ్రుగ్గు లిడుదురు పురసతుల్ ముత్తియముల. (జ) 355

చ. దలదవదాత కంజదళ ధౌతకనత్కలధౌతమల్లికా
వలుల విలాసలీల శరవర్గమృణాళ మనోజ్ఞహార వ
ల్లుల రవణంబునన్ సకలలోకనుతోజ్జ్వలకందబృందకం
దళములచాయఁ జంద్రకిరణంబులకుం దెలుపెక్కె నంతటన్ (జ) 356

చ. నవకపుఁదెల్లమ్రుగ్గు జతనంబునఁ గూర్చివియద్గృహంబునన్
దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చఁగా
సవరఁగ దీర్చి కాలమను జక్కులముద్దుఁడు వేడ్కతో దివా
యవనికఁ బాయఁదట్టె నన నంచితలీల వెలింగెఁ దారకల్ (జ) 357

గీ. పట్టువడ కది చపలతఁ బాఱె మనసు
సూరిజననుత! రూపఱి సుడిసె గాలి
యండగొనె నారి గట్టియై యాశుగంబు
లప్పురముగుఱ్ఱముల వేగమరసి చూడ. (జ) 358

ఉ. పొంకపుగుబ్బలుం బునుఁగుఁబూతయుఁ దుమ్మెదకప్పుమేనులున్
జంకెనచూపులున్ జఘనసైకత సీమలఁ బారుటాకులున్
మంకెనచాయమోములును మానితహస్తధనుశ్శరంబులున్
గొంకక భిల్లకామినులకుం దగియుండుఁ బసిండిగుబ్బలిన్. (జ) 359

ఉ. పోలఁగ నందులం గలుగు పుష్పసుగంధుల రూపవైభవ
శ్రీ లరయంగఁ గోరి యట జేరిన ఖేచరయక్షదైవత