ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 69

గీ. దేజమంతయు శిఖియందుఁ దిరము గొల్పి
కడఁకఁ దలలెత్తి పటుమాంసకలశ శంకఁ
బదరి జలచరపంక్తి పైపైఁబడంగఁ
బడియె నపరాంబురాశిలోఁ బద్మహితుఁడు. (జ) 323

చ. పనివడి పాకశాసను నెపంబునఁ బంకజసంభవుండు నీ
తనువుఁ దొఱంగఁ జేసె నతిదారుణశాంభవరోషవహ్నిచే
మనమున నాటి యాగ్రహము మానక నీవును సంఘటించి తా
ఘనునిశిరంబుఁ ద్రుంచు తమకం బితరుల్ తెలియంగ నేర్తురే. (జ) 324

ఉ. పోకులఁ బోయి యన్యసతిఁ బొందినవాఁడు సదాకళంకి దో
షాకరుఁ డుగ్రమూర్తి సముద్రవిషాగ్నిసహోదరుండు ప
ద్మైకవిరోధి సంతతజినాత్ముఁడు మా సరిగాఁడటంచు ను
త్సేకముతోడ రాజు నిరసింతురు రాజకుమారు లప్పురిన్. (జ) 325

సీ. బింబంబు హిమధామబింబంబు నడఁగించు మధురాధరాననమండలములు
మించులఁ బసిఁడిక్రొమ్మించులఁ దలపించు నతిమనోహరకటాక్షాంగరుచులు
నగములఁ గృష్ణపన్నగములు నగుఁ గుచద్వితయరోమావళీవిభ్రమములు
దమ్ములఁ దేటిమొత్తమ్ముల నిరసించు నంఘ్రిద్వయీవినీలాలకములు
గీ. కరము కేసరిఁ గేసరోత్కరముఁ దెగడు
మధ్యకోమలదంతాంశుమండనంబు
లౌర! నుతియింప నజునకునైన వశమె?
యప్పురంబున నొప్పారు నబ్జముఖుల. (జ) 326

క. బీరమునఁ బొదలి సమర
ప్రారంభమె పెండ్లియనుచు బలవర్షమునన్
వైరులకు వెన్నుచూపని
శూరప్రజ మప్పురమునఁ జూడఁగ నొప్పున్. (జ) 327

క. మందేహ దేహదహనా
మందక్షతజప్రవాహ మహనీయనదీ
సందేహదాయి యగుచును
గ్రందున నెఱసంజ మింటఁ గానఁగ నయ్యెన్. (జ) 358