ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 37

ఆ. మహిమ చెడదు స్వామ్యమాత్య సుహృత్కోశ
రాష్ట్రదుర్గబలపరాయణులకు
నీవు నిదియు నెఱిఁగి కావింపు సప్తాంగ
సంగ్రహంబు నీతిశాస్త్రనిపుణ! (జ) 164

తిప్పరాజు, కుడిచెర్ల [కాంచీమాహాత్మ్యము] (ఆం)

గీ. అరుణమణిదీప్తు లంతంత నతిశయిల్ల
విమలశశికాంతరోచులు విస్తరిల్ల
గావ్యబుధగురుసంగతి గలిగి పురము
సూర్యసోమవీథులు కడుసొంపు మిగిలె. (ఆం) 165

గీ. కనకభూధరశిఖరానుకారు లగుచు
నా పురంబున నొప్పారు గోపురములు
సంతతాధ్వగమన పరిశ్రాంతులైన
చంద్రసూర్యుల విశ్రమస్థలములట్లు. (ఆం) 166

మ. జ్వలదగ్ని ప్రథమానతేజుని భరద్వాజున్ వినిర్ధౌత వ
ల్కల భాస్వత్పరిధానుఁ బింగళజటాలంకారుఁ గృష్ణాజినో
జ్జ్వల సంవ్యానుఁ దపః కృశీకృతతనున్ శాంతాత్ము బ్రహ్మైక ని
శ్చలచిత్తున్ విజితేంద్రియున్ బ్రముదితస్వాంతున్ గృపావంతునిన్. (ఆం) 167

సీ. పద్మరాగప్రభాభాసురపటల మ కాల సంధ్యారాగ లీలఁ బెనుపఁ,
గాశ్మీర కనకనిర్గతదీప్తి యసమయ బాలాతపస్ఫూర్తిఁ బరిఢవింప,
హరినీలరుచులు గస్తురిప్రోవులును ననా రంభ నీలాభ్రవిభ్రమముఁ జేయ,
వజ్రమౌక్తిక హిమవాలుకాదీప్తులు నిర్నిశాచంద్రిక నిర్వహింపఁ,
గీ. జతురబహువర్ణ పట్టవస్త్ర ప్రభాతి
నిర్జలద జాల సముదీర్ణ నిర్జరేంద్ర
చాపలక్ష్మి రచింపఁ బ్రశస్త [దీప్తి]
[వి]తతి నొప్పారు నప్పురి విపణివీథి. (ఆం) 168

సీ. మహనీయతర యాజమాన మంత్రంబులు జపియించు ముఖచతుష్టయము దనరఁ,
బావన నవనీత పరిలేపనంబున మెఱుఁగెక్కియున్న క్రుమ్మేను వెలుఁగ,
బహుచిత్రమృదుసూక్ష్మపక్ష్మశోభితమైన హరిణాజినోత్తరీయంబు మెఱయ,
శ్రీవత్సలాంఛన శ్రీమూర్తిచింతన సంభృతానందబాష్పములు దొరుగ,