ఈ పుట ఆమోదించబడ్డది
10. మహిమపరచడం

పూర్వవేదంలో యూవే ప్రభువు మోషే మొదలైన భక్తులకు తేజస్సుతో దర్శనమిచ్చేవాడు. ఈ తేజస్సు దైవసాన్నిధ్యమే. దీనికి హీబ్రూలో "కబోద్" అనీ, గ్రీకులో "డోక్సా" అనీ పేరు. ఈ తేజస్సునే ఇంగ్లీషులో Glory అని, తెలుగులో మహిమ అనీ అనువదించారు. మహిమ అంటే కీర్తిగౌరవాలు. యిప్రాయేలీయులకు కొండమిరాద ప్రభువు తేజస్సు కన్పించింది-నిర్గ 24, 17. గుడారంమిద ప్రభువు తేజస్సు కన్పించింది -సంఖ్య 14,10.

పౌలు ఈ భావాన్ని క్రీస్తుకి అన్వయించాడు. తండ్రి తన తేజస్సుని ఉత్థాన క్రీస్తుకి ఇచ్చాడు. ఆ క్రీస్తు ద్వారా మనం కూడ తన తేజస్సులో పాలుపొందేలా చేసాడు. దేవుడు తాను ఎన్నుకొన్నవారిని పిల్చాడు. పిల్చినవారిని నీతిమంతులను చేసాడు. నీతిమంతులైన వారికి తన తేజస్సులో పాలు ఇచ్చాడు-రోమా 8,30. తండ్రి తేజస్సు అంటే తండ్రి కీర్తే. క్రీస్తుద్వారా మనం కూడ తండ్రి కీర్తిలో పాలుపొందుతాం.

ఈ భావాన్నే కొలోస్సీయుల జాబు, ఎఫెసీయుల జాబు ఇంకోవిధంగా వర్ణించాయి. తండ్రి మనలను అంధకారంనుండి తొలగించి తనకుమారుని రాజ్యంలోనికి చేర్చాడు-కొలో 1,13. తండ్రి మనలను క్రీస్తుతో పాటు లేపి పరలోక స్థలంలో క్రీస్తుతోపాటు కూర్చుండబెట్టాడు -ఎఫె 26. తండ్రి తేజస్సులో పాలుపొందడమన్నా తండ్రి రాజ్యంలో పాలుపొందడమన్నా ఒకటే. దేవుడు క్రీస్తుద్వారా మనం కూడ తన కీర్తి గౌరవాల్లో పాలుపొందేలా చేసాడు. మోక్షంలో దైవసాన్నిధ్యంలో వుండిపోయేలా చేసాడు. ఇది దేవుడు మనలను మహిమపరచడం.