ఈ పుట ఆమోదించబడ్డది

3. పరిసయులు ధర్మశాస్రం ఆదేశించిన పుణ్యక్రియలు చేయడంద్వారా రక్షణం పొందుతామని భావించారు. తాము పుణ్యక్రియలు చేస్తున్నారు కనుక దేవుడు తమ్మురక్షించి తీరాలనీ, అతడు తమకు బుణపడి వున్నాడనీ ఎంచారు. అనగా రక్షణం నరులే స్వయంగా సాధించేది. పౌలు ఈ భావాన్ని ఖండించాడు. అతనికి క్రీస్తులోనికి జ్ఞానాస్నానం పొందడం ద్వారా పాపపరిహారమూ, ఆత్మ ప్రదానమూ, దత్తపుత్రత్వమూ మొదలైన భాగ్యాలు ఉచితంగానే లభించాయి. కనుక మనలను రక్షించేది క్రీస్తు పట్ల విశ్వాసమేగాని ధర్మశాస్రంలోని ఆజ్ఞలను పాటించడం గాదని బాహాటంగా ప్రకటించాడు. రక్షణం దేవుడిచ్చే ఉచితవరంగాని మన కృషిని బట్టీ మన యోగ్యతను బట్టీ సిద్ధించేది కాదు అని బోధించాడు.

4. యూదులు ధర్మశాస్త్రం పాటించేది తామే కనుక రక్షణం గూడ తమకే పరిమితం ఔతుందనుకొన్నారు. అన్యజాతి ప్రజలు నాశమైపోతారు అని భావించారు. పౌలు క్రీస్తుని నమ్మితేచాలు అన్యజాతులకు కూడ రక్షణం లభిస్తుందని తెలియజేసాడు. తాను అన్యజాతులకు ప్రేషితుడనని సగర్వంగా చెప్పకొన్నాడు - రోమా 11,13.

5. పౌలు మొదట సిలువపై చనిపోయిన క్రీస్తు శాపగ్రస్తుడు అనుకొన్నాడు - ద్వితీ 21.23. కాని ఈ దర్శనం తర్వాత అతని ఆలోచన మారింది. క్రీస్తేమో శాపగ్రస్తుడే. కానీ తన పాపాల కొరకు గాక మన పాపాల కొరకు శాపగ్రస్తుడు అయ్యాడు. అతడు సిలువపై చనిపోవడం ద్వారా మన పాపాల శాపాన్ని తాను స్వీకరించి మనలను విముకులను చేసాడు-గల 3, 13. ఆ విమోచనాన్ని పౌలు ఉత్సాహంతో బోధించాడు.