అర్చన
సర్వమున్ కదలం జేయు కాలమూర్తికి నమస్కారము సత్తీర్కికిన్! అన్నాడు భర్తృహరి.
' కాలముదాటదుస్తరమెట్టివారికిన్ ' అన్నాడు అనుభవజ్ఞఉడయిన మరోకవి.
' కాలః కలయతామహమ్ ' - అని శ్రీకృష్ణ భగవానుడు.
కాలపురుషుడే భగవంతుడనీ, ఆ భగవత్స్వరూపుణ్ణి మన వైజ్ఞానికులు నిర్విరామంగా కొలుస్తూనే, నిశితంగా కొలిచిన్నీ ఉన్నారు.
మన్వంతరాలు, కల్పాలు, యుగాలు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, వారాలు, దివారాత్రాలు ఇత్యాదిగా.
అమావాస్య, పూర్ణిమా తిథులు, నక్షత్రాలు మొదలయిన కొలబద్దలతో హద్దులు ఏర్పరచారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుణ్ణి సర్వలోక కలనాత్మకుడైన ' కాలమూర్తి ' అన్నారు మన పెద్దలు.
" మాయ అనే కాగులో కాలపురుషుడు సమస్తాన్ని ఉడకపెడతాడు. దివారాత్రాలు ఇంధనాలు, సూర్యుడు, అగ్ని, ఋతువులు, మాసాలు అనే తెడ్లు ఆకాగులోని పదార్ధాన్ని నిరంతరం కలియ తిప్పుతూ ఉంటాయి." వార్త అంటే ఏమిటి? అనే యక్షుని ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సూటి సమాధానం ఇది.
పచనమయ్యే పదార్ధం ఉడక్కపోవడం, చిమిడిపోవడం, మాడిపోవడం మొదలైన దోషాలకు లోను కాకుండా తెడ్లవలె ఋతువులు, మాసాలు జాగ్రత్త వహిస్తాయి.
ఆ జాగృతికి ఫలితంగా పండుగలూ పర్వాలు ఏర్పడ్డాయి. లోక సంక్షేమార్ధులైన మన పూర్వఋషులు, నక్షత్రగమనాన్ని బట్టి, ఋతుధర్మాన్ని బట్టి ఈ పండుగల నన్నింటినీ ఏర్పరచారు. మానవుడు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా జీవించడానికి ఏయే ఋతువుల్లో ఏయే రకాల క్రియాకలాపాలు చేయాలి. ఏయే పదార్ధాలు సేవించాలి అనే విషయాలన్ని పండుగలలో ఆచారాల రూపంలో స్థిరపరచి తమ సంతతికి అందించారు.